ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫైర్ సేఫ్టీ త‌నిఖీల‌కు నెల విరామం.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 10:55 AM

 ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజులు హైడ్రా విరమాం ఇచ్చింది. ఈ నెల రోజుల గడువులో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపులు, వ్యాపార సముదాయాల వారు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ మేరకు షాపుల యజమానులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు హైడ్రా, జీహెచ్ ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో శనివారం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సమావేశమయ్యారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో  జీహెచ్ ఎంసీ, ఫైర్, పోలీసు విభాగాలతో హైడ్రా తనిఖీలు చేసి 9 షాపుల వరకూ సీజ్చేసిన విషయం విధితమే. నెల రోజులు గడువు కావాలని పలు వ్యాపార సంఘాలు, దుకాణదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని సమావేశం పరిగణనలోకి తీసుకుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని పేర్కొంటూ ఆ 9 షాపుల వారి నుంచి అషిడవిట్లు తీసుకున్నాక వ్యాపారాలకు అనుమతివ్వాలని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఉపేక్షించరాదని పేర్కొంది. 


 పాతబస్తీ, బేగంబజార్, ట్రూప్ బజార్, మదీన సెంటర్ ఇలా ముఖ్యమైన వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అందిరిలో చైతన్యం తీసుకు వస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. హైడ్రా, జీహెచ్ ఎంసీ, ఫైర్ విభాగాలతో కలిసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు రూపొందిస్తున్నామన్నారు. కరపత్రాలలో ఈ నిబంధనలను ప్రచారం చేస్తామన్నారు.  వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్న చోట సమావేశాలు ఏర్పాటు చేసి అందరిలో ఫైర్ సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలో  అవగాహన కల్పిస్తామన్నారు.  ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగితే అందులో ఉన్న వారు సులభంగా బయటకు వచ్చేలా కారిడార్లు, మెట్ల దారులు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. వస్త్రాలు, ప్లాస్టిక్ వస్తువులు, పెయింట్, ఆయిల్, కెమికల్ డబ్బాలు, యాసిడ్ నిలువలు, టైర్లు, ఫైబర్ వస్తువులు, ఫోమ్ ఇలా మండే స్వభావం ఉన్న వస్తువుల నిలువలు ఎక్కువ మొత్తంలో లేకుండా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వీడియోలను ప్రదర్శించి.. కారణాలను వివరించారు. 


 సెల్లార్లను ఆయా షాపుల వారు గోదాములుగా మార్చవద్దని హైడ్రా కమిషనర్ సూచించారు. పై అంతస్తుల్లో ప్రమాదం జరిగినా కిందకు దిగి వెళ్లడానికి వీలుంటుందని.. సెల్లార్లలోనే ప్రమాదం జరిగితే అగ్గిలో దూకే పరిస్థితి ఎదురౌతుందని హెచ్చరించారు.సెల్లార్ల నిండా స్టాక్ పెట్టి వాటిని కాపాడే క్రమంలో గ్రిల్స్ ఏర్పాటు చేయడం.. వాటికి తాళాం వేయడంతో నాంపల్లి ఘటనలో ఐదుగురు మృతికి కారణమైందన్నారు. ఇటీవల తనిఖీల్లో ప్రమాదకరంగా నిలువలు సెల్లార్లలో గమనించామని.. అందుకే సీజ్ చేయడం జరిగిందన్నారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగిస్తే.. ట్రాఫిక్ జామ్లు తగ్గడంతో పాటు.. కొనుగోలుదారులకు ఎంతో ఊరటగా ఉంటుందన్నారు. 


అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తే ఆటోమేటిక్గా ఆర్పేవ్యవస్థ (వాటర్ స్ప్రింక్లర్లు) ఉండాలి. స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండడమే కాదు.. వాటి నిర్వహణ సరిగా ఉండాలి. 


 నాణ్యమైన విద్యుత్ వైర్లనే వినియోగించాలి. అలాగే మీరు తీసుకున్న విద్యుత్ పవర్ సామర్థ్యానికి మించి వినియోగిస్తే.. ట్రిప్ అయి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. 


 పవర్ సప్లైతో పాటు.. సరఫరా ప్యానెల్స్ ఏర్పాటు చేసిన చోట ఒక వేళ నిప్పు రవ్వలు పడినా మంటలు వ్యాపించకుండా.. కింది భాగంలో కంకరతో చాంబర్లు ఏర్పాటు చేయాలి.


 విద్యుత్ లైట్లు, వైర్లకు చేరువలో వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


 కింద వ్యాపారాలు, పై అంతస్తుల్లో నివాసాలున్న చోట మరింత అప్రమత్తంగా ఉండాలి.


ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పాయింట్లు పెట్టినప్పుడు, ఏసీలు వినియోగిస్తున్నప్పుడు విద్యుత్ వినియోగం పెరుగుతుందని.. ఆ విధంగా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. 


 మదీన, బేగంబజార్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక వాహనం వెళ్లే విధంగా అక్కడి స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలి. 


 సెల్లార్లలో వాచ్మ్యాన్ల కుటుంబాల నివాసాలుండకూడదు. వంటలకు సంబంధించి క్యాంటిన్లు పెట్టరాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa