వాటిని కొలతల్లో లెక్కలు కడితే 7 వేల గజాలు. డబ్బుల్లో విలువును పరిశీలిస్తే రూ. 85 కోట్లు. ప్రాణ వాయువును అందించే పార్కులుగా లెక్కలు కడితే ఆ విలువ అనంతం. అందుకే పార్కుల పరిరక్షణకు హైడ్రా ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్రమంలోనే మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో 7 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. వ్యవస్థలను మేనేజ్‌చేసుకుంటూ కబ్జాలకు పాల్పడిన వారి ఆటలకు అడ్డుకట్ట వేసింది. 1980లో 183 ప్లాట్లతో బాబానగర్ కాలనీ లే ఔట్‌ను వేశారు. ఇందులో 3 వేల గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. 1999 వ సంవత్సరం వరకూ ఇది పార్కుగానే కొనసాగింది. కాప్రా సర్కిల్ వారు ఈ మేరకు హద్దులు నిర్ధారించి ప్రహరీ కూడా నిర్మించారు. కాని తర్వాత ఆ లే ఔట్‌లో 183 ఉన్న ప్లాట్ల సంఖ్య 189కి పెరిగిపోయింది. మొత్తం 3 వేల గజాలను 500ల గజాల చొప్పున 6 ప్లాట్లుగా మార్చేశారు. ఇలా పార్కునే ప్లాట్లుగా చేసి అమ్మిన ప్లాట్లలో 188వ ప్లాట్ కొన్న బొట్ల సాయి తర్వాత కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడయ్యాడు. 500ల గజాల ప్లాట్‌లో 266 గజాల మేర బొట్ల సాయి ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన 234 గజాల స్థలాన్ని ఖాళీగా ఉంచాడు. 188 ప్లాట్‌కు పక్కన ఉన్న రహదారి స్థలాన్ని కూడా కబ్జా చేస్తూ బై నంబర్లు వేసి బొట్ల సాయి 50 గజాల చొప్పున మరో 6 ప్లాట్లు చేసి అమ్మాడంటూ మొత్తం ఉదంతంపై అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 3 వేల గజాల పార్కును కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు జీహెచ్ ఎంసీ, రెవెన్యూ అధికారులతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 3 వేల గజాలు పార్కుకు కేటాయించినట్టు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే కొన్ని నివాసాలు రాగా.. మిగిలిన 2 వేల గజాల స్థలాన్ని పరిరక్షిస్తూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే ఉప్పల్ మండలం నాచారం గ్రామంలోని కార్తికేయ నగర్‌లో కూడా 3 ఓపెన్ ప్లేస్‌లతో పాటు.. పార్కులకు కేటాయించిన 5 వేల గజాలను హైడ్రా శనివారం కాపాడింది.పార్కు స్థలాలను కాపాడిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa