రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలపై తీవ్ర విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ఇటీవల పరిగిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని తెలంగాణ మంత్రిని చేస్తా అని తాను ఎక్కడా చెప్పలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా నిధులను ఇచ్చి.. అభివృద్ధి చేసే బాధ్యతను రంజిత్ రెడ్డికి ఇస్తానని తాను పరిగి బహిరంగ సభలో చెప్పినట్లు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
పరిగి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రంజిత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి ప్రత్యేక నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ శాఖ తన వద్దే ఉన్నందున తన తరఫున.. రంజిత్ రెడ్డికి అక్కడి అభివృద్ధి పనులను అప్పగిస్తానని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. పలు విషయాలు చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్న అజారుద్దీన్‍కు సంబంధించి.. ఆయనను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తే ఎందుకు ఆమోదించలేదు అనేది గవర్నర్ చెప్పాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక దేశంలో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అయిన తర్వాతే జమిలీ ఎన్నికలు ఉంటాయని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరుగుతాయని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎంపీల ఆధారంగా నియోజకవర్గాల పెంపు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa