ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 08:09 PM

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ముందే రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. పోలింగ్ కంటే ముందే.. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పుర పోలింగ్‌కు ముందే అన్నదాతలకు శుభవార్త చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అర్హులైన రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా నిధులను జమ చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.


అయితే సర్కార్ ఖజానాలో డబ్బులేకపోవడం వల్ల రైతు భరోసా నిధులు పడటం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధులను సమీకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రూ.9000 కోట్ల రుణాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండెంట్ పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం రూ.9 వేల కోట్ల మేర రుణాలను 13 ఏళ్ల నుంచి 27 ఏళ్ల కాల పరిమితితో తీసుకోనున్నట్లు సమాచారం.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది జరిగితే.. ఈనెల 10వ తేదీన ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఆ రూ.9 వేల కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు రోజే.. ప్రభుత్వ అకౌంట్ల నుంచి రైతు భరోసా సొమ్ము నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఇలాంటి సమయంలో రైతు భరోసా నిధులు పడతాయా లేదా అనే డౌట్ అవసరం లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రైతు భరోసా నిధులు విడుదలకు ఎలాంటి అడ్డంకి ఉండదు. ఎందుకంటే కేవలం కొత్తగా అమలు చేసే పథకాలు మాత్రమే ఎన్నికల కోడ్ సందర్భంగా అమలు చేయరాదు. కానీ రైతు భరోసా గతంలో నుంచే అమలులో ఉన్న పథకం కాబట్టి నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నేపథ్యంలోనే ఒక్కో రైతుకు ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa