ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరా మహిళాశక్తి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 11:17 AM

 సమ్మక్క- సారలమ్మ మహా జాతర– 2026 సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళాశక్తి (IMS) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని 10 మండలాలను కవర్ చేస్తూ మొత్తం 565 ఆదాయ యూనిట్లను SHG ల ద్వారా ఏర్పాటు చేయగా, వారు జాత‌ర స‌మ‌యంలో రూ. 3 కోట్ల‌కు పైగా ఆదాయాన్ని సంపాదించారు.  మంత్రి శ్రీమతి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయింపచేశారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు క‌ల్పించారు. మంత్రి శ్రీమతి సీత‌క్క స్వ‌యంగా ఈ యునిట్ల‌ను ప్రారంభించి వారి బిజినెస్ కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించారు.  ప్రభుత్వ ప్రోత్సాహకం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్ డ్రింక్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాళ్లు, బ్యాంబూ చికెన్, క్యాంటీన్లు, స్నాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని ఆర్థికంగా లాభపడ్డారు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమ‌లు అవుతున్న ఇందిరా మ‌హిళా శ‌క్తి ఘ‌న విజ‌యానికి ఇది నిద‌ర్శ‌నమ‌ని మంత్రి శ్రీమతి సీత‌క్క పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప్రొత్సాహ‌కం, మ‌హిళా సంఘాల పట్టుదల, ఆడబిడ్డ‌ల శ్రమ ఫలితమ‌ని అభినందించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడుతూ స్వయంసమృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa