గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించినప్పుడు, ఈ నిర్ణయం స్పష్టమైన హేతుబద్ధత లేకుండా, ఏ విధమైన ప్రాతిపదికను వెల్లడించకుండా, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధంగా తీసుకున్నదిగా స్పష్టమవుతోంది. ఇంత కీలకమైన పరిపాలనా మార్పును గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా ప్రకటించడం తీవ్రంగా ఖండనీయమైన విషయం.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలోని పట్టణ ప్రాంతాలను రెండు వేర్వేరు కార్పొరేషన్లలో చేర్చడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టత లేదు. సైబరాబాద్ కార్పొరేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న బండ్లగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాలను GHMC పరిధిలో చేర్చడం ఎందుకు జరిగింది? అలాగే మల్కాజిగిరి కార్పొరేషన్‌కు పక్కనే ఉన్న బడంగ్‌పేట్, తుక్కుగూడ, మీర్‌పేట్ ప్రాంతాలను GHMC పరిధిలో ఉంచడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటి? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ ప్రాంతాన్ని మల్కాజిగిరిలో చేర్చకుండా GHMCలో కలపడం ఏ విధమైన ప్రమాణాల ఆధారంగా జరిగింది? ఈ విభజనలో భౌగోళిక, పరిపాలనా, జనాభా ప్రమాణాలను ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా? లేక పూర్తిగా ఇష్టానుసార నిర్ణయాలేనా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.GHMC ను మూడు భాగాలుగా విభజించాలంటే సమతుల్యంగా, న్యాయంగా విభజించాల్సిన అవసరం ఉంది. అయితే, కొత్త GHMCలో 150 డివిజన్లు, సైబరాబాద్ కార్పొరేషన్‌లో 76 డివిజన్లు, మల్కాజిగిరి కార్పొరేషన్‌లో 74 డివిజన్లు ఉండటం ద్వారా ఈ విభజన ఎంత అసమతుల్యంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ అసమాన విభజన వెనుక రాజకీయ అంతర్మం ఏదైనా ఉందా అనే అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిపాలనా స్థిరత్వం దెబ్బతింటోందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో శివారు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను GHMCలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇప్పటికే అనేక మార్పులకు లోనయ్యారు. ఇప్పుడు తిరిగి వాటిని విడదీయడం ద్వారా ప్రజల్లో తీవ్ర గందరగోళం, అయోమయం ఏర్పడుతోంది. ఇది అనాలోచిత నిర్ణయమే కాకుండా, ప్రజలపై అనవసరమైన పరిపాలనా భారాన్ని మోపే చర్యగా మారుతోంది.
అంతేకాక, గత శాసనసభ సమావేశంలో శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సంబంధిత మంత్రులు నిండు సభలో స్పష్టంగా ప్రకటించారు. అలాంటి హామీలను విస్మరించి, ఇప్పుడు పూర్తి విరుద్ధ నిర్ణయం తీసుకోవడం శాసనసభకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే చర్యగా భావించాల్సి వస్తోంది.
GHMC సమావేశంలో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనే డివిజన్ల విభజన ఉంటుందని అధికారులు స్పష్టం చేసినప్పటికీ, ఆ హామీలకు విరుద్ధంగా రెండు నియోజకవర్గాల ప్రాంతాలను కలుపుతూ డివిజన్ల ఏర్పాటు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధత అర్థం కావడం లేదు. GHMC సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అభ్యంతరాలు, సూచనలు పూర్తిగా విస్మరించి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఈ విభజన నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమైన విషయం.కావున, ఈ విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే పునఃపరిశీలించాలి. స్పష్టమైన ప్రమాణాలు, హేతుబద్ధతతో కూడిన, సమతుల్యమైన విభజన మాత్రమే చేపట్టాలని ప్రజల తరఫున బలంగా డిమాండ్ చేస్తున్నాను. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలపై పరిపాలనా భారాన్ని మోపే నిర్ణయాలను విరమించుకొని, ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa