ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్కపిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 07:54 PM

తెలంగాణ మంత్రి సీతక్క.. ఓ కుక్కను దత్తత తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో శనివారం డాగ్ అడాప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఓ కుక్కను దత్తత తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి చేతుల మీదుగా ఇండియన్ బ్రీడ్‌కు చెందిన ఓ కుక్కపిల్లను మంత్రి సీత‌క్క దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కుక్క పిల్లలను దత్తత తీసుకున్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ రేణుకా చౌదరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. కార్యక్రమాన్ని నిర్వహించిన జీహెచ్ఎంసీ అధికారులను అభినందించారు. నగరం నడిబొడ్డున ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా.. వాటికి జీవించే హక్కు కల్పించటంతో పాటుగా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అహింసా సిద్ధాంతాన్నే ఎల్లప్పుడూ అనుసరిస్తూ వస్తోందని.. అహింసాయుత పద్ధతులలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. విశ్వాసానికి, నమ్మకానికి కుక్క మారుపేరు అని.. ఇంట్లో ఒక కుక్క ఉంటే సురక్షితంగా, భద్రతా ఉన్నామనే భావన ఉంటుందన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి సీతక్క తెలిపారు.


మరోవైపు తెలంగాణలో ఇటీవలి కాలంలో కుక్కలను చంపేసిన ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలపై మంత్రి సీతక్క స్పందించారు. కొన్నిచోట్ల కొంతమంది సర్పంచులు కుక్కలను చంపివేయించిన ఘటనలు ప్రస్తావిస్తూ.. అలాంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందన్నారు. అలాంటి చర్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఈ తప్పులను ప్రభుత్వానికి ఆపాదించడం సరైంది కాదని అన్నారు. వీధి కుక్కలను చంపకూడదని, నియంత్రణ చర్యలు పాటించి.. మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.


గతంలో గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ ఒక కుక్క ఉండేదని.. పది మందితో సమానంగా కాపలా కాసేదని సీతక్క గుర్తుచేశారు. అందరూ స్వదేశీ కుక్కలను దత్తత తీసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మానవత్వ విలువలు తగ్గిపోయి మానవ సంబంధాలు దెబ్బతింటున్న నేటి పరిస్థితులలో.. కుక్క మాత్రం ఎల్లప్పుడూ తన యజమాని పట్ల విశ్వాసంతో ఉంటుందని సీతక్క అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa