తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 'హంగ్' పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రతి ఓటూ వజ్రాయుధంతో సమానం కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేల వ్యవహారం గులాబీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ మారిన లేదా కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఎక్స్ అఫీషియో ఓటింగ్ సమయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా ఉండేందుకు కఠినమైన 'విప్' జారీ చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు.
ఒకవేళ పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేస్తే, ఆ సాక్ష్యాలతో అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. న్యాయపరంగా బలమైన ఆధారాలు సేకరించడానికి ఈ ఓటింగ్‌ను ఒక అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది. విప్ ఉల్లంఘన ద్వారా సదరు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది పార్టీ అగ్రనేతల అసలు వ్యూహంలా కనిపిస్తోంది.
మరోవైపు, బీఆర్ఎస్ ఎత్తుగడలను గమనిస్తున్న సదరు ఎమ్మెల్యేలు కూడా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. విప్ జారీ చేస్తే ఓటింగ్‌లో పాల్గొని రిస్క్ తీసుకోవడం కంటే, గైర్హాజరై దూరంగా ఉండటమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు కాంగ్రెస్ స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఇటు పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవచ్చనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa