ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.564 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 10:09 PM

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల ఆశావహులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్ చెప్పినట్లయింది. తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి పీఎం ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రాష్ట్రంలో పనులు ప్రారంభమై నిధులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను మళ్లీ నిర్మించనున్నారు. ఈ క్రమంలోనే త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి.. లబ్దిదారులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం విడుదల చేయనున్న నిధులు ఉపయోగపడనున్నాయి.


డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించనుంది. ఈ క్రమంలోనే రూ.564 కోట్ల నిధులు విడుదల చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇటీవలె రాష్ట్రం నుంచి సంబంధిత అధికారులు.. ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను కలిసి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. త్వరలోనే నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.


మరోవైపు.. రాష్ట్రంలో 1.45 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. వాటిలో 60 వేల ఇళ్లను నిర్మించి ఇప్పటికే లబ్దిదారులను గుర్తించి.. వారికి అందించారు. మరో 30 వేల ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకుని.. పంపిణీకి రెడీగా ఉన్నాయి. మిగిలిన ఇళ్లు ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇవి నిధులు లేకపోవడం వల్ల ఆగిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్న ఈ నిధులతో నిర్మాణంలో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేసి.. వీలైనంత త్వరగా లబ్దిదారులను పంపిణీ చేయనున్నారు. సొంతంగా స్థలం.. సొంతంగా ఇళ్లు లేనివారిని అర్హులుగా గుర్తించి.. వారికి ఈ ఇళ్లను అందించనున్నారు.


కానీ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిధులు పొందాలంటే నిబంధనలు పాటించాల్సిందే. లబ్ధిదారుల పేర్లు, పూర్తి వివరాలు అన్నీ కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మొదట ఇళ్లను నిర్మించి పూర్తి చేసి.. ఆ తర్వాత లబ్దిదారులకు ఇచ్చేవారు. ఇళ్లు ఇచ్చిన తర్వాతే లబ్దిదారులకు పేర్లను పంపించేవారు.


కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వేరుగా ఉండటంతో ఆ నిధులు రాష్ట్రానికి రాలేదు. ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటీవలె పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయడంతో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం.. తన వాటాగా లబ్దిదారులకు అందిస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa