ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమెరికాలో ఉచితంగా ట్రైనింగ్ ,,,6 వారాల పాటు శిక్షణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 05:48 PM

తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ కింద వారికి అమెరికాలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వచ్చే 2026-27 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి ఈ ప్రోగ్రామ్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం కల్పించారు. అర్హులైన గవర్నమెంట్ టీచర్లు.. ఈ ప్రోగ్రామ్ కింద అప్లై చేసుకునేందుకు మార్చి 6వ తేదీ వరకు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రోగ్రామ్ పూర్తి అయ్యే వరకు ఉపాధ్యాయులు ఆన్ డ్యూటీగానే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుండగా.. అమెరికాకు వెళ్లి, అక్కడ ఉండి.. తిరిగి వచ్చే ఖర్చులు మొత్తం అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది.


ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫుల్‌బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారికి అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో 6 వారాల పాటు ప్రత్యేక అకడమిక్ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫెలోషిప్‌కు అయ్యే మొత్తం ఖర్చును అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఎంపికైన వారికి వీసాతోపాటు విమాన టికెట్లు, అక్కడ ఉండేందుకు వసతి, భోజనం, హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు రోజువారీ అలవెన్స్‌ కూడా అందిస్తారు.


అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ ఆరు వారాల శిక్షణ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆన్ డ్యూటీగా కూడా పరిగణిస్తుంది. అయితే ఇది అందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్తించదు. కేవలం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించే టీచర్లకు మాత్రమే అర్హత ఉంటుంది. దీంతోపాటు 5 ఏళ్ల పాటు బోధన చెప్పిన అనుభవం ఉండాలి. ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు బోధించే టీచర్లకు ప్రాధాన్యత ఉంటుంది. వీటితోపాటు వారికి కచ్చితంగా ఇంగ్లీష్‌ భాషపై మంచి పట్టు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా టోఫెల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌లో కనీసం 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.


ఈ ఫెలోషిప్‌ను ఫుల్‌బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్ United States India Educational Foundation నిర్వహిస్తుంటుంది. ఆసక్తి కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అధికారిక వెబ్‌సైట్ అయిన www.usief.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లు దాఖలు చేసుకునేందుకు మార్చి 6వ చివరి తేదీ అని అధికారులు స్పష్టం చేశారు. ఎంపికైన వారు వచ్చే ఏడాది జనవరి లేదా సెప్టెంబర్‌లో 2 విడతలుగా అమెరికా వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో ట్రైనింగ్ పొందుతారు. అక్కడి బోధనా విధానాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్, టెక్నాలజీ మార్పిడి వంటి అంశాల్లో ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టీచర్లకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa