కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మొదటి నుంచి.. భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు ఉందని తెలిపారు. వేర్వేరు అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన.. అలాంటి నేతలను వేధించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని స్పష్టం చేశారు. ఇది గతంలో మహాత్మాగాంధీ ఉన్నప్పటి నుంచి కొనసాగుతోందని చెప్పారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నేతలం మనలో మనం ఘర్షణలకు దిగితే.. పార్టీని కాపాడటం కోసం కష్టపడుతున్న లక్షల మంది కార్యకర్తలకు అన్యాయం చేసినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సన్నద్ధత, ప్రజలతో అనుసంధానం కోసం కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ-డీసీసీ) అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిని అయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేదని ఈ రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాను పార్టీలో ఉన్న కొందరు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నానని తెలిపారు. తన ఆలోచనలను పార్టీలోని అందరి నేతలను కలిసి చెప్పి అందర్నీ ఒప్పించానని వెల్లడించారు. కార్యకర్తలు, నేతలు అందరూ కలిసి కృషి చేయడంతోనే పార్టీకి ఓటింగ్ పెరిగిందని తెలిపారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా మంచిగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన మరో 60 మంది నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నేతలందరి పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్న సీఎం.. మెరిట్ ఉన్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఎలాంటి లిస్టులకు చోటు లేదని.. కేవలం మెరిట్ లిస్ట్ ప్రకారమే అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. డీసీసీ పదవి చాలా విలువైందని.. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీసీసీ పదవి ఎన్నో పదవులకు తలుపులు తెరుస్తుందని.. పీసీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కూడా కావొచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక గాంధీ కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప కుటుంబం గాంధీలది అని గుర్తు చేశారు. దేశం కోసం రూ.వేల కోట్ల ఆస్తులను మోతీలాల్ నెహ్రూ త్యాగం చేశారని.. ఎన్నో ఏళ్లు జవహర్‌లాల్ నెహ్రూ జైలులో ఉన్నారని గుర్తు చేశారు. భారతదేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మధ్య నడిచారని పేర్కొన్నారు. గాంధీల కుటుంబంపై అవినీతి ఆరోపణలు గట్టిగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa