కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ వార్ మెుదలైంది. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చారు. ఎమ్మెల్యే కాటిపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహేందర్‌రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, అరోరా కాలేజీ భూములు, శిశు మందిర్ పాఠశాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్న క్రమంలో కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నడుస్తోంది. ఈ క్రమంలో దమ్ముంటే చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ ఉదయం శిశుమందిర్ వద్దకు చర్చకు రావాలని షబ్బీర్ అలీని ఛాలెంజ్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు ఆఫీసు దగ్గరికి చేరుకున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు ధ్వసం చేయటంతో పాటు రోడ్డుపైనే పల్టీలు కొట్టించారు. అనంతరం కారుకు నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినలేదు. అప్రమత్తమైన పోలీసులు మంటల్ని ఆర్పేశారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు తీసుకొని శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు రావాలని, తాను స్వయంగా వస్తానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీ భూముల నుంచి స్థలాలు పొందిన సంస్థల ప్రతినిధులు, అధికారులు వస్తారన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాలతో రావాలని కోరారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్దకు వెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతం కాటిపల్లిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అయినా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో భారీగా పోలీసులను మెహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa