తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అన్నదాతలను ఆదుకునేందుకు అంకితభావంతో పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. ఆదివారం (మార్చి 8) రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన రెండు రోజుల 'మెగా రైతు మేళా'లో మంత్రి తుమ్మల ప్రసంగించారు. రైతు సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేసిందన్నారు. ఇప్పటివరకు దాదాపు 25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల మేర పంట రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. రైతు సంక్షేమ పథకాలను పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని అనారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే మహిళా రైతుల కోసం 'వ్యవసాయ యాంత్రీకరణ' (అగ్రి మెకనైజేషన్) పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో మహిళపాత్రను బలోపేతం చేస్తామన్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 'అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం - 2026', అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి ఏడాది ఒకే రకమైన పంటలు కాకుండా పంటల మార్పిడి ద్వారా లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ మేళా మహిళా రైతుల సాధికారతకు ఒక గొప్ప వేదిక అని అన్నారు.
పీజేటీఎస్ఏయూ, కోరమాండల్ ఇంటర్నేషనల్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ మేళాలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు పాల్గొన్నారు. ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ ఎం.ఎల్. జాట్ సైతం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధికి తీసుకుంటున్న చొరవను ప్రత్యేకంగా కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa