హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో కొత్త కోర్సులను తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సీఎన్‌సీ మెషిన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2డీ, 3డీ ప్రొడక్ట్ డిజైనింగ్ వంటి షార్ట్ టర్మ్ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి.. కంపెనీలకు, నిరుద్యోగులకు మధ్య ఉన్న గ్యాప్ ఏంటి అనేది వివరించారు. కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ నిరుద్యోగుల వద్ద లేకపోవడం వల్లే వారికి ఉద్యోగాలు రావడం లేదని పేర్కొన్నారు. అలాంటి వారు ఆయా కోర్సులను నేర్చుకుని.. కంపెనీకి కావాల్సిన నైపుణ్యాలను అందించినపుడే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.
చాలా మంది పరిశ్రమ వర్గాలు స్కిల్స్ ఉన్నవాళ్లు దొరకడం లేదని చెప్తున్నారని ఈ సందర్భంగా మంత్రి వివేక్ తెలిపారు. పరిశ్రమలకు అవసరం ఉన్న స్కిల్స్‌పై విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పినట్లు వెల్లడించారు. కంపెనీలకు అవసరమైన స్కిల్ సెట్‌ను అమలు చేయాలని.. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధం రంగాల కోర్సులు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులతో పోల్చితే మన ఉత్పత్తులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పిన మంత్రి.. త్వరలోనే అగ్రి అలైడ్ సెక్టార్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో కూడా అవసరమైన కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి.. పరిశ్రమలకు అవసరమైన స్కిల్ సెట్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తేల్చి చెప్పారు. విద్యార్థులకు మల్టీ స్కిల్ సెట్స్ అవసరమని.. అవి నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఏటీసీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చిన వాళ్లు కచ్చితంగా ఉద్యోగాలు సాధించే విధంగా తయారు కావాలని ప్రిన్సిపాల్‌కు తాను ఎప్పుడూ చెప్తూ ఉంటానని పేర్కొన్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి వివేక్ సూచించారు.
ఇక టామ్ కామ్ ద్వారా ఇతర దేశాల్లో ఉపాధి కోసం పంపించేందుకు పలు రకాల స్కిల్స్ నేర్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. విదేశాల్లో ఎక్కువ జీతాలు ఉంటాయని.. వాటితో తమ కుటుంబాలను ఉన్నత స్థితిలోకి తీసుకురావచ్చని తెలిపారు. ఏటీసీల నుంచి 25 వేల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారని.. భవిష్యత్‌లో జిల్లాల్లో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa