మంగళగిరి నగరంలోని పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు పద్మశాలి బహూత్తమ సేవా సంఘం అధ్యక్షులు వూట్ల సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో మంగళవారం సాంబశివరావు మాట్లాడారు. 25వ తేదీ రాత్రి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అదే రోజు ఉదయం విఘ్నేశ్వరపూజ, స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం జరుగుతుందన్నారు.
26వ తేదీ ఉదయం పులి వాహనంపై నూతన వధూవరులైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషిస్వామి వార్ల గ్రామోత్సవం జరుగుతుందన్నారు. 29 రాత్రి స్వామివార్ల పవళింపు సేవ మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా రాత్రి కూచిపూడి నాట్యం, మ్యూజికల్ నైట్, కోలాట భజనలులతోపాటు 29వ తేదీ రాత్రి స్వామివారి పవళింపు సేవ సందర్భంగా శివ భక్త బృందం భజనలు, పౌరాణిక నాటకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కావున మంగళగిరి నగర పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మునగాల వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు వూట్ల వెంకట సాంబశివరావు, మాచర్ల వెంకటేశ్వరరావు, సంఘం నాయకులు మునగాల రమేష్, మునగాల రమేష్ బాబు, వూట్ల శ్రీమన్నారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.