భారత విపణిలో తమ వాటా పెంచుకునేందుకు ఎంజీ మోటార్ ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. జనవరి నెలలో 4,144 యూనిట్ల రిటైల్ అమ్మకాలు చేసినట్లు సంస్థ ప్రకటించింది. సప్లై చైన్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కంపెనీ తెలిపింది. ప్రొడక్షన్ సైకిల్ వేగంపై దృష్టి సారించినట్లు వివరించింది. ఎంజి మోటార్ ఇండియా 2019 లో హెక్టర్ ఎస్‌యూవీతో దేశంలో అడుగుపెట్టింది. ఈ సంస్థ ప్రస్తుతం ZS ఈవీ, గ్లోస్టర్, ఆస్టర్ వంటి కార్ మోడళ్లను పరిచయం చేయనుంది. గత నెలలో నిర్వహించి ఆటో ఎక్స్‌పోలో వీటిని ప్రదర్శించింది.
భారతీయ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు ఎంజీ మోటార్ సంస్థ తెలిపింది. హెక్టార్, ఎస్టోర్ అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపింది. ఎంజీ ఎయిర్ మోడల్‌ను దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన వాటా పెంచుకోవాలని చూస్తోంది. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్‌కు సుమారు రూ.12 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. ఈ ధరలో ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తే అమ్మకాలు పెరుగుతాయని భావిస్తోంది.