వయస్సు మీద పడేకొద్దీ ఆ ఛాయలు మొహంలో కనిపించేస్తుంటాయి. ముఖ్యంగా చర్మంపై ముడతలు పడుతుంటాయి. ఇది వృద్ధాప్య ఛాయల్లో ఒకటి. అయితే కొంతమందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తుంటాయి. చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చు. ఈ ముడతలు బాగా తెల్లగా ఉన్న వారిలో, చర్మం పల్చగా ఉన్న వారిలో ఇవి చిన్న వయస్సులో మొదలవుతాయని సౌందర్య నిపుణులు అంటున్నారు. ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో, కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్యలు ఎదురవుతాయి. చాలామంది చీటికీ మాటికీ నుదురు చిట్లిస్తుండడం, అదే పనిగా కనుబొమ్మల్ని పైకి ఎగరేయడం చేసేవారిలో ఈ ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.
సాధారణంగా చర్మంపై ఏర్పడిన ముడతలు తొలగిపోయే ఛాన్స్ లేదు. కానీ వచ్చిన ముడతలను మరింత పెరగకుండా చూసుకోవచ్చు. దీనికోసం నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల వరకు నీటిని తీసుకోవాలి. నీటితో పాటు పండ్లు రసాలు తీసుకోవాలి. చర్మంపై ఎండ ఎక్కువగా పడితే కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా నుదుటి మీది చర్మం కమిలిపోయి నల్లగా మారుతుంది. దీంతో ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు పెరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే దీనికి మార్గం. ఒత్తిడి, మానసిక ఆందోళనలను అదుపులో పెట్టుకోవాలి. దీనికోసం యోగా, మెడిటేషన్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతో పాటు సమతుల ఆహారం తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటుండాలి.