సిబిల్ స్కోరు.. ఏదైనా లోన్ తీసుకోవాలన్నా.. క్రెడిట్ కార్డు కావాలన్నా.. భవిష్యత్తులో ఇతర చాలా వాటి కోసం ఇది తప్పనిసరి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ అందించే క్రెడిట్ స్కోరునే సిబిల్ స్కోరు అని అంటారు. అయితే ఈ సిబిల్ స్కోరుకు ప్రాధాన్యం ఏంటి? ఇదెంత ఉండాలి? ఎలా లెక్కిస్తారు. తెలుసుకుందాం.
మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలనుకుంటే ముందుగా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోరు/సిబిల్ స్కోరు ఎంత ఉందని అడుగుతాయి. ఇంకా క్రెడిట్ కార్డు కావాలన్నా కూడా ఎవరైనా క్రెడిట్ స్కోరు ఎంతుందనే అడుగుతాయి. ఇది తక్కువగా ఉంటే మీకు లోన్ రావడం కష్టమే. క్రెడిట్ కార్డు అందుకోవడం కూడా కష్టమే. సిబిల్ స్కోరుకు అంత ప్రాధాన్యం ఉంటుంది. లోన్ వచ్చినా కూడా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అందించేటువంటి క్రెడిట్ స్కోరును సిబిల్ స్కోరు అంటారు. ఎన్నో ఆర్థిక అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సిబిల్ స్కోరు లెక్కిస్తారు.
సిబిల్ స్కోరు కోసం రుణ గ్రహీతల 36 నెలల క్రెడిట్ ప్రొఫైల్ పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రొఫైల్‌లోనే ఇంటి లోన్లు, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఆటో మొబైల్ లోన్లు, ఓవర్ డ్రాఫ్ట్, అన్ని రకాల లోన్ల చరిత్ర ఉంటుంది. ఈ క్రెడిట్ హిస్టరీని అనుసరించి సిబిల్ స్కోరు లెక్కిస్తుంటారు.
సిబిల్ స్కోరు ఎంత ఉండాలి?
సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750-900 మధ్య ఉంటే దాన్ని అత్యుత్తమమైనదిగా పరిగణిస్తుంటారు. 650-750 మధ్య ఉంటే మంచి స్కోరుగా, 550-650 మధ్య ఉంటే యావరేజ్ అని, 300-550 గా ఉంటే తక్కువ స్కోరుగా పరిగణిస్తారు.
గత చరిత్ర..
సిబిల్ స్కోరు లెక్కింపులో ఎక్కువగా ప్రభావితం చేసే అంశం గత పేమెంట్ హిస్టరీ. దీని కోసం క్రెడిట్ బ్యూరోలు మీ బిల్స్, ఈఎంఐలకు సంబంధించి గత మూడేళ్ల చెల్లింపుల నెలవారీ రికార్డును పరిగణనలోకి తీసుకుంటాయి.
క్రెడిట్ వినియోగం..
క్రెడిట్ కార్డులో మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్‌లో ఖర్చు చేసే మొత్తాన్ని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) అంటారు. సాధ్యమైనంత వరకు దీనిని 30-40 శాతంగా ఉండేలా చూసుకోవాలి. క్రెడిట్ మిక్స్.. సిబిల్ స్కోరు మీ రుణ పోర్ట్‌ఫోలియోపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆలస్య చెల్లింపుల విషయంలో సురక్షిత రుణం కంటే అన్‌సెక్యుర్డ్ లోన్ క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. హార్డ్ ఎంక్వైరీలు.. బ్యాంకులు లేదా వ్యక్తులు లోన్ కోసం అప్లై చేసినప్పుడు వాటినే హార్డ్ ఎంక్వైరీలు అంటారు. అందుకే అవసరానికి మించి దరఖాస్తు చేయడం సిబిల్ స్కోరుపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది.