వినియోగదారులకు హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలనే అమ్మాలని ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే కొందరు బంగారు వ్యాపారులు మాత్రం ఎస్సేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్ (AHC) నుంచి కాకుండా.. సొంతంగానే హాల్‌మార్కింగ్ ముద్రించి బంగారం విక్రయిస్తున్నారు. ఇలాంటి మోసాల్ని నివారించాలంటే వినియోగదారులు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అసలు బంగారం స్వచ్ఛత ఎలా గుర్తించాలి.. ఈ హాల్‌మార్కింగ్ అంటే ఏంటి? దీని ఛార్జీలు ఎలా ఉంటాయి.. హాల్‌మార్క్ లేకుంటే ఏం చేయాలి. వంటి వివరాలు చూద్దాం.
మీరు ఎప్పుడైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో.. నగలపై బీఐఎస్ మార్కు చూడాలి. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. గోల్డ్ స్వచ్ఛతను బట్టి 14,18,22 క్యారెట్లలో హాల్‌మార్కింగ్ ఉంటుంది. హాల్‌మార్క్ 22కె.. 91.60 శాతం స్వచ్ఛత సూచిస్తుంది. ఇంకా నగలు కొనుగోలు చేసే ముందు ఆ నగల వ్యాపారిని బీఐఎస్ లైసెన్స్ చూపించమని అడగొచ్చు. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం.. షాపులో లైసెన్స్ ప్రదర్శించాల్సి ఉంటుంది. లైసెన్స్‌లో ఉన్న షాప్ పేరు, అడ్రస్ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
హాల్‌మార్కింగ్ ఛార్జీల విషయానికి వస్తే.. బిల్ బ్రేక్ అప్ అడిగి తీసుకోవాలి. దీంట్లోనే హాల్‌మార్కింగ్ కోసం వారు ఎంత వసూలుచేశారో తెలుస్తుంది. హాల్‌మార్కింగ్ చేసిన వస్తువులకు నగల దుకాణాదారుడి నుంచి ఏహెచ్సీ లు రూ. 45 వసూలు చేస్తాయి. ఇంకా సిల్వర్ జువెలరీకి హాల్‌మార్కింగ్ ఛార్జీ కింద రూ. 35 వసూలు చేస్తాయి. మీరు సొంతంగా కూడా ఏహెచ్‌సీ ఆభరణాల్ని తనిఖీ చేసుకోవచ్చు. బీఐఎస్ వెబ్‌సైట్‌లో ఏహెచ్సీ జాబితా ఉంటుంది. కొంత ఛార్జీలు చెల్లించి కస్టమర్లు.. ఏహెచ్‌సీ దగ్గర ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోవచ్చు. టెస్టింగ్ తర్వాత ఆభరణాల స్వచ్ఛతను సూచిస్తూ.. ఏహెచ్సీ రిపోర్ట్ ఇస్తుంది. నగల వ్యాపారి చెప్పిన దాని కంటే స్వచ్ఛత తక్కువ ఉన్నట్లు తేలితే గనుక ఆ వ్యాపారి నష్టపరిహారం చెల్లించాలి. ఇంకా హాల్‌మార్కింగ్ ఫీజు కూడా తిరిగి చెల్లించాలి.