బ్యాంకుల్లో మనకు ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి, చదువుకునే వారికి, వృద్ధులకు ఇలా దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇక వారికి బ్యాంకులతో ఎప్పుడూ ఏదో ఒక పని పడుతుంది. డబ్బులు డిపాజిట్ చేసేందుకు, విత్‌డ్రా చేసుకునేందుకు, లోన్ల కోసం, పాస్‌బుక్, చెక్‌బుక్స్ కోసమో.. ఏదైనా పథకం ప్రారంభించేందుకో బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. మరి.. ఉపాధి కోసం సిటీల్లో ఉండేవారు ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లాలనుకుంటే ముందు షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. తీరా బ్యాంకుకు వెళ్లాక ఆరోజు మూసివేసి ఉంటే మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు జనవరి నెలలో పండగల సీజన్ కాబట్టి సెలవులు కాస్త ఎక్కువే ఉన్నాయి. అయితే ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది. మరి ఈ ఫెస్టివల్‌కు బ్యాంకులకు సెలవు ఉందా? అన్ని రాష్ట్రాల్లో ఉంటుందా? ఎక్కడెక్కడ ఎప్పుడు సెలవు ఉంది.. చూద్దాం.
చాలా రాష్ట్రాల్లో మకర సంక్రాంతి/పొంగల్/మాఘ్ బిహూ/ఉత్తరాయన పుణ్యకాల/మాఘే సంక్రాంతి సందర్భంగా ఈ సోమవారం (జనవరి 15) బ్యాంకులకు సెలవు ఉంది. ఈ రోజున కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అసోంల్లో బ్యాంకులకు సెలవుగా ఉంది. ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు లాంగ్ వీకెండ్ వస్తుంది. జనవరి 13 రెండో శనివారం, జనవరి 14 ఆదివారం, జనవరి 15 సంక్రాంతి సెలవు ఇలా 3 రోజులు కలిసివస్తుంది. అందుకే ఏదైనా బ్యాంకుల్లో పని ఉంటే ముందే చూసుకోవడం మంచిది.
బ్యాంక్ సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంటుంది. రాష్ట్రాల్ని బట్టి సెలవులు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. మొబైల్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్ వంటి సేవలు పనిచేస్తాయి. ఇంకా డబ్బు విత్‌డ్రా, డిపాజిట్ చేసేందుకు ఏటీఎంలు సహా డిపాజిట్ మెషీన్లు కూడా అందుబాటులో ఉంటాయి.