ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్ వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు మదుపరులు. అలాగే కొన్ని ఫండ్స్ హైరిటర్న్స్ అందిస్తుండడమూ పెట్టుబడులు పెరిగేందుకు కారణమవుతున్నయాని చెప్పవచ్చు. అయితే, సరైన ఫండ్‌ని ఎంచుకుని పోర్ట్ ఫోలియోను నిర్మించుకున్న వారికే హైరిటర్న్స్ వస్తాయి. అలాగే ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలతో ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు. ప్రస్తుతం మార్కెట్లోకి కొన్ని కొత్త పథకాలు వచ్చాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వైట్‌వోక్ క్యాపిటల్..
వైట్‌వోక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ రెండు కొత్త స్కీమ్స్ తీసుకొచ్చింది. అందులో వైట్ వోక్ క్యాపిటల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, వైట్ వోక్ క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ ఉన్నాయి. ఇవి థీమ్యాటిక్ క్లాస్ కు చెందిన ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్. న్యూ ఫండ్ ఆఫర్ జనవరి 30వ తేదీతో ముగుస్తుంది. బ్యాంకింగ్ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.300 గా ఉండగా.. హెల్త్ కేర్ ఫండ్‌లో రూ.500 కనీసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సైతం ఒక ఇండెక్స్ ఫండ్ తీసుకొచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 వాల్యూ ఇండెక్స్ పేరుతో దీనిని లాంఛ్ చేసింది. ఈ స్కీమ్ ఎన్ఎఫ్ఓ జనవరి 29తో ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా ఉంది. ఇందులో బ్లూచిప్ కంపెనీలపైనే ప్రధానంగా పెట్టుబడులు పెడుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్..
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్. ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ చివరి తేదీ జనవరి 29తో ముగుస్తుంది. ఇందులో రూ.500 కనీసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇవి పెట్టుబడులు పెడుతుంటాయి.
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్- నిఫ్టీ 50లోని స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేసి లాభాలు ఆర్జించే కొత్త ఇండెక్స్ ఫండ్ ని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్స్ పేరుతో లాంఛ్ చేసింది. దీని ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ జనవరి 29గా ఉంది. అలాగే ఇందులో కనీసం రూ.500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.
మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్..
మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ పేరుతో కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఇది ప్రధానంగా పెద్ద కంపెనీలపైనే ఇన్వెస్ట్ చేస్తుంది. దీని ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ జనవరి 31గా ఉంది. ఈ ఫండ్ పోర్ట్ ఫోలియోలో 80 శాతం మేర నిఫ్టీ 100 లార్జ్ క్యాప్ సంస్థలే ఉంటాయి.