దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డబ్బులు దాచుకోవడం ద్వారా సురక్షితంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. ఎలాంటి డిపాజిట్లు చేయాలన్నా ముందుగా ఎస్‌బీఐ వైపే మొగ్గు చూపుతారు. ప్రజల్లో ఈ బ్యాంకుపై మంచి విశ్వాసం ఉంది. అదే స్థాయిలో బ్యాంకు సైతం వివిధ సేవలు అందిస్తుంటుంది. హామీతో కూడిన రాబడులు పొందాలని అనుకుంటున్న వారు స్టేట్ బ్యాంకులో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం రూ. 2 కోట్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కలిగిన టర్మ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3. 5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7. 5 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. జనరల్ కస్టమర్లతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును అందిస్తోంది ఎస్‌బీఐ. ప్రస్తుతం బ్యాంకు 2-3 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7. 5 శాతం మేర గరిష్ఠ వడ్డీ రేటు కల్పిస్తోంది.
3 ఏళ్ల టెన్యూర్‌పై రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంతొస్తుంది?
3 సంవత్సరాల మెచ్యూరిటీ టెన్యూర్ కోసం సాధారణ ఖాతాదారులు రూ. 5 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. వారికి ప్రస్తుతం 7 శాతం వడ్డీ రేట్లు ఇస్తోంది ఎస్‌బీఐ. ఆన్‌లైన్ ఎఫ్‌డీ కాలిక్యూలేటర్ ప్రకారం మెచ్యూరిటీ నాటికి ఎంతొస్తుందో ముందే తెలుసుకోవచ్చు. సాధారణ కస్టమర్లకు 3 ఏళ్ల తర్వాత వడ్డీ రూపంలో రూ. 1,15,720 వరకు వస్తాయి. అంటే మొత్తంగా రూ. 6,15,720 వస్తాయి. అలాగే సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే వారికి వడ్డీ రేటు 7. 5 శాతంగా ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే మెచ్యూరిటీ తర్వాత వారికి వడ్డీగా రూ.1,24,858 అందుతాయి. మొత్తంగా మెచ్యూరిటీ తర్వాత రూ. 6,24, 858 చేతికి వస్తాయి.