మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు, సహా ఇతర కారణాలతో ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల వైపు చూస్తున్నారు. ప్రభుత్వం సైతం విద్యుత్తు వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. అలాగే ఇప్పుడు ఈ జాబితాలో బ్యాంకులు సైతం చేరిపోయాయి. గ్రీన్ కార్ లోన్ పేరిట తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు నాలుగు ప్రధాన బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లతో లోన్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు, ఇతర ఆఫర్లు ఏ విధంగా ఉన్నాయో పూర్తి లిస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎస్‌బీఐ:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను ప్రోత్సహించేందుకు తగ్గింపు వడ్డీ రేట్లతో లోన్లు అందిస్తోంది. ఎస్‌బీఐలో రుణం తీసుకుని విద్యుత్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లకు 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లో జనవరి 31 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదని తెలిపింది. ప్రస్తుత వడ్డీ రేటు 8.75% నుంచి 9.45% వరకు ఉంది.
యూనియన్ బ్యాంక్:
యూనియన్ ఆఫ్ ఇండియాలో మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి తక్కువ వడ్డీకే ఎలక్ట్రిక్ కార్ల కోసం రుణాలు ఇస్తోంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా 9.15 నుంచి 12.25 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తోంది. అలాగే ప్రీ పేమెంట్ సైతం చేయవచ్చు. ఇలా ముందస్తు చెల్లింపులు చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని బ్యాంక్ తెలిపింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు:
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో పీఎన్‌బీ గ్రీన్ కార్ (ఇ-వెహికల్) రుణాలు అందిస్తోంది. దీనిపై వడ్డీ రేటు 8.75 శాతం నుంచి 9.75 శాతం వరకు ఉంది. ఈ రుణంపై బ్యాంకు ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంటేషన్ ఫీ మాఫీ చేసింది. అంటే ఎలాంటి ఫీ వసూలు చేయడం లేదు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర:
ఎలక్ట్రిక్ కార్లపై ఇచ్చే రుణాలపై 8.8 శాతం నుంచి 13 శాతం వరకు వడ్డీ రేట్లు వసూలు చేస్తోంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎలక్ట్రిక్ గ్రీన్ కార్ లోన్ స్కీంపై ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంట్ ఫీ వంటివి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ప్రీ-పేమెంట్, ప్రీ-క్లోజర్ పేమెంట్లపైనా అదనపు ఛార్జీలు లేవని వెల్లడించింది. రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు, వృత్తి, వయసు ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చని తెలిపింది.