పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ సేవలు జరపవద్దని, డిపాజిట్ల సేకరణ, వాలెట్, ఫాస్టాగ్ వంటి సేవలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. దీంతో పేటీఎం షేర్లు కుప్పకూలుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ కోసం పేటీఎం వాడాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు ప్రజలు. ఈ క్రమంలోనే విక్రయదారుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కాయిట్ వ్యాపారులకు కీలక సూచనలు చేసింది. యూపీఐ కోసం పేటీఎంకు బదులు చట్టబద్ధమైన ఇతర చెల్లింపు యాప్స్ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అయితే, నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ సలహా ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం సూచన మాత్రమేనని పేర్కొంది.
ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎంపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. భద్రత విషయంలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారని కాయిట్ పేర్కొంది. పేటీఎం అందించే ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనసాగింపుపైనా అనుమానాలు నెలకొన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరంతరాయ ట్రాన్సాక్షన్లు, వాటి భద్రత కోసం పేటీఎం నుంచి ఇతర యాప్స్ కి మారడం మేలని సూచించింది. డైరెక్ట్ యూపీఐ లావాదేవీలు, బ్యాంకులు అందించే పేమెంట్ యాప్స్ ఉపయోగిస్తే మరింత మంచిదని సూచించింది.
'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఫలితంగా భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. పేటీఎం యాప్ లో ఆర్థిక సేవలను వినియోగించుకోవడంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, వాటి భద్రత కోసం, ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే వ్యాపారులు ఇతర పేమెంట్ యాప్స్ కి మారిపోవాలని సూచిస్తున్నాం. బ్యాంకులకు తమ తమ పేమెట్ యాప్స్ ఉంటాయి. వాటిని వినియోగించడం మంచిది.' అని సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఘండేల్వాల్ ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ట్రేడర్ల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ సూచనలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తాజా అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు.