పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. బ్యాంకింగ్ సేవలు నిలిపివేయాలని, ఎలాంటి డిపాజిట్లు సేకరించవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదు. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్, వాలెట్లు, ఫాస్టాగులు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల వంటి వాటిల్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాప్ అప్స్ చేయకూడదు. ఈ బ్యాంకు కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ప్రకారమే చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. పేమెంట్స్ బ్యాంక్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్ లో తెలినట్లు పేర్కొంది. దీంతో మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని తెలిపింది.
ఇవే కారణమా?
పేటీఎం పేమెంట్స్ బ్ాయంక్ పై ఆర్‌బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇంధుకు కారణంగా తెలుస్తోంది. ఎటువంటి ధ్రువీకరణ లేకుండానే అకౌంట్లు తెరవడం, ఆయా ఖాతాల కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదని సమాచారం. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంక్ మధ్య కోట్లాది రూపాయలకు సంబంధించి మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు సమచారం. ఈ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ సైతం కలుగజేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి కేవైసీ పూర్తి చేయని లక్షలాది అకౌంట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఒకే పాన్ కార్డుతో 1000 కిపైగా అకౌంట్లు తెరిచిన ఉదంతాలు వెలుగు చూశాయని సమాచారం. అలాగే కేవైసీ పూర్తి చేసిన ఖాతాల్లో నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించి లావాదేవీలు జరిగినట్లు ఆడిట్ సంస్థలు గుర్తించాయటా. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు 35 కోట్లు ఇ-వాలెట్లు ఉన్నాయి. అందులో 31 కోట్ల ఖాతాలు ఇనాక్టివ్ గా ఉన్నాయి. మిలిగిన 4 కోట్లు అకౌంట్లు సైతం జీరో బ్యాలెన్స్ లేదా కొద్ది మొత్తం బ్యాలెన్స్ కలిగి ఉన్నాయి. ఇనాక్టివ్ గా ఉన్న ఖాతాలను మనీ లాండరింగ్ కోసం ఉపయోగించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
70 శాతం పడిపోయిన పేటీఎం షేర్లు..
ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేరు గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 40 శాతానికిపైగా నష్టపోయింది. శుక్రవారం రోజున చివరకు రూ.487.05 వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 17.37 వేల కోట్లు కోల్పోయింది. 2021లో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.2150 ఇష్యూ ధరతో రూ.18,300 కోట్లు సమీకరించింది. నవంబర్ 18వ తేదీన రూ.1950 వద్ద ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయింది. అదే రోజు రూ.1560 కి పడిపోయింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కంపెనీ షేరు ఏకంగా 77 శాతం మేర పడిపోవడం గమనార్హం.