2020-21లో కరోనా విజృంభించిన నేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇక వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ లాభనష్టాల గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా పని ఉత్పాదకత గురించి చర్చ నడుస్తుండగా.. మరో వింత కారణంతో ఒక మహిళ ఉద్యోగం కోల్పోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న భార్య ఫోన్ కాల్స్ రహస్యంగా విన్న ఒక వ్యక్తి ఏకంగా 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 15 కోట్ల వరకు) ఆర్జించాడు. చివరికి గుట్టు బయటపడింది. ఇంకేం ఆమె ఉద్యోగం పోయింది. అతడి భర్త పోస్టూ ఊడింది. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అసలేం జరిగిందో చూద్దాం.
అమెరికా టెక్సాస్‌కు చెందిన టైలర్ లూడన్ అనే వ్యక్తి భార్య BP Plc (గతంలో బ్రిటిష్ పెట్రోలియం అండ్ బీపీ అమోకో) అనే కంపెనీలో పనిచేస్తోంది. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఒక డీల్‌పై పనిచేస్తుంది. ట్రావెల్‌సెంటర్స్ ఆఫ్ అమెరికా ఇంక్‌ను బీపీ కొనుగోలు చేసే డీల్‌పై ఇంటి వద్ద ఉన్న ఆఫీస్ నుంచి ఆమె వర్క్ చేస్తుంది.
దీని గురించి భార్య ఫోన్ కాల్స్ రహస్యంగా విని తెలుసుకున్న లూడన్.. షేర్లు పెరుగుతాయని గ్రహించి ట్రావెల్‌సెంటర్స్ ఆఫ్ అమెరికాలో వాటా కొనుగోలు చేశాడు. ఈ వ్యవహారం కొన్ని నెలల పాటు సాగింది. 2023 ఫిబ్రవరిలో ఆ కంపెనీని బీపీ Plc సంస్థ 74 శాతం ప్రీమియంతో కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించగా.. లూడన్ తన బ్రోకరేజీ, రిటైర్మెంట్ అకౌంట్లను వేగంగా లిక్విడేట్ చేశాడు. దీంతో ఏకంగా రూ. 15 కోట్ల లాభం వచ్చింది. ఇలా రహస్యంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి భార్యను, ఆమె కంపెనీని మోసం చేశాడు.
భార్యకు తెలియదట..!
లూడన్ వ్యాపార కార్యకలాపాల గురించి యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) వెల్లడించింది. ఇది తన భార్యకు తెలియదని పేర్కొంది. దీంతో షాకవ్వడం ఆమె వంతైంది. భార్య ఫోన్ కాల్స్ ద్వారానే రహస్యంగా పొటెన్షియల్ డీల్ గురించి తెలుసుకొని అతడు ఈ పని చేసినట్లు లూడన్ కూడా ఒప్పుకున్నాడు. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి భర్త నుంచి విడాకుల కోసం అప్లై చేసింది. తర్వాత ఈ విషయాన్ని ఆమె తన కంపెనీకి తెలియజేసినప్పటికీ.. తన ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి రుజువు లేకపోయినా సదరు మహిళ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. సెటిల్మెంట్‌లో భాగంగా లూడన్ అక్రమంగా తాను సంపాదించిన దానిని తిరిగి ఇచ్చేందుకు, ఇంకా జరిమానా కూడా చెల్లించేందుకు అంగీకరించాడు.