రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022 మార్చి నుంచి 2023 మే వరకు దాదాపు సంవత్సర కాలంలోనే రెపో రేట్లను భారీగా పెంచుకుంటూ పోయింది. అధిక ద్రవ్యోల్బణం నుంచి తప్పించుకునేందుకు, ఆర్థిక మాంద్యం దరిచేరకుండా చూసేందుకు రెపో రేటును 4 శాతం నుంచి ఏకంగా 250 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీంతో చాలా బ్యాంకులు కూడా లోన్ వడ్డీ రేట్లు పెంచి ఇదే సమయంలో డిపాజిట్లపైనే అధిక వడ్డీ ఆఫర్ చేశాయి. ఇంకొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద అధిక వడ్డీ రేటుతో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని కూడా ప్రారంభించాయి. ఇక ఇప్పుడు ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి స్పెషల్ ఎఫ్‌డీ తీసుకొచ్చింది. దీని వివరాలు చూద్దాం.
ఇతర బ్యాంకులతో పోల్చి చూస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు FD పై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తాయి. ఇంకా స్పెషల్ స్కీమ్స్‌పై అంతకుమించి వడ్డీ పొందొచ్చు. మరోవైపు సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది. చాలా బ్యాంకుల్లో ఇది వారితో పోలిస్తే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువే ఉంటుంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 15 నెలల కాలపరిమితితో ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై రెగ్యులర్ సిటిజెన్లకు అత్యధికంగా 8.50 శాతం వడ్డీ అందిస్తుండగా.. అదే సీనియర్ సిటిజెన్లకు అయితే మరో 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ చేసి 9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై ఇది వర్తిస్తుంది. స్వల్పకాలంలో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఆశించే వారి కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.
రూ. లక్ష డిపాజిట్ చేస్తే..
ఇక 15 నెలల వ్యవధిపై రూ. లక్ష డిపాజిట్ చేస్తే రెగ్యులర్ సిటిజెన్లకు 8.50 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ. 10,253 వడ్డీ పొందుతారు. మొతం చేతికి 15 నెలల్లో రూ. 1,10,253 వస్తుంది.
ఇదే సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే.. 9 శాతం వడ్డీ ప్రకారం 15 నెలల్లో రూ. లక్ష డిపాజిట్‌పై రూ.10,853 వడ్డీ అందుతుంది. చేతికి మొత్తం రూ. 1,10,853 వస్తుంది.
ప్లాటినా డిపాజిట్‌పై సీనియర్ సిటిజెన్లకు 9.20 శాతం వడ్డీ కింద రూ. 11,093 వడ్డీ వస్తుంది. 15 నెలల్లోనే లక్ష డిపాజిట్‌ను రూ. 1,11,093 చేసింది.