భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బును పొదుపు చేయడం మంచి అలవాటు. అది భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులను తీర్చేందుకు ఉపయోగపడుతుంది. అయితే, పెట్టుబడి పెట్టేందుకు ప్రస్తుతం చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు రిస్క్ తీసుకుని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే.. మరి కొందరు వడ్డీ తక్కువ వచ్చినా ఎలాంటి రిస్క్ లేని ప్రభుత్వ పథకాల వంటి వాటిల్లో తమ డబ్బులను పెడుతుంటారు. రిస్క్ తీసుకోలేని వారి కోసం పోస్టాఫీసు ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అందిస్తోంది. అందులో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఏ నష్టభయంలేని, మంచి రాబడిని ఇచ్చే సురక్షితమైన పొదుపు పథకాల్లో ఇదీ ఒకటి. ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ స్కీమ్ లో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. 10 ఏళ్ల వయసు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మైనర్ల తరపున వారి తల్లిదండ్రులు, సంరక్షకులు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా తీసుకోవచ్చు. ఈ స్కీమ్స్ లో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి. వ్యక్తిగతంగానూ, జాయింట్ ఖాతానూ ఓపెన్ చేసేందుకు వీలుంటుంది.
ప్రస్తుతం ఈ పథకంలో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.8 శాతం వడ్డీ ఇస్తోంది కేంద్రం. రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 6.9 శాతం, మూడేళ్లకు 7 శాతం, 5 ఏళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు ఇస్తోంది. త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది. ఇందులో వచ్చే వడ్డీ రాబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
రూ.5 లక్షలకు రూ.10 లక్షలు..
ఈ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో రూ. 5 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 7.5 శాతం వడ్డీ వర్తిస్తుంది. దీని ప్రకారం వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. ఒక వేళ మీరు అసలు, వడ్డీని తీయకుండా అలాగే మరో ఐదేళ్ల పాటు కొనసాగించారు అనుకుందాం. అప్పుడు మీకు ఏకంగా రూ. 5,51,175 వడ్డీ లభిస్తుంది. పదేళ్ల తర్వాత మీ పెట్టుపడి రెండింతలు అవుతుంది. అంటే మొత్తంగా మీ చేతికి 10 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత రూ. 10,51,175 వస్తాయి.