ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25,994 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. 2001 తర్వాత తొలిసారిగా ఒక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇన్ఫోసిస్‌లో ఇదే తొలిసారి అని తాజాగా ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,17,240 గా ఉండగా.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 7.5 శాతం వరకు తగ్గింది. ఇక త్రైమాసికం పరంగా చూస్తే కిందటి త్రైమాసికంతో పోలిస్తే జనవరి- మార్చి సమయంలో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖయ్ 5423 తగ్గింది. ఉద్యోగుల్ని సంస్థ తొలగించడం లేదా వారే బయటకు వెళ్లడం జరిగిందన్నమాట. ఇక ఉద్యోగుల సంఖ్య ఇన్ఫీలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ తగ్గింది.
ఇక కంపెనీ అట్రిషన్ రేటు విషయానికి వస్తే గత 12 నెలల డేటాను బట్టి చూస్తే స్వల్పంగా తగ్గింది. అంతకుముందు ఇది 12.9 శాతంగా ఉండగా.. ఇప్పుడు 12.6 శాతానికి దిగొచ్చింది. అట్రిషన్ రేటు అంటే సిబ్బంది వలసలు. అంటే సంస్థ ఉద్యోగులు.. ఇతర కంపెనీల్లోకి వెళ్లడం అన్నమాట. ఐటీ కంపెనీల్ని కొంతకాలంగా అట్రిషన్ రేటు వేధిస్తోంది. ఈ కారణంతో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. ఆ ఖాళీల్ని ఇతరులతో భర్తీ చేసేందుకు నియామకాలు కూడా చేపట్టట్లేదు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం.. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించుకోకపోవడం.. ఫ్రెషర్లకు ఆందోళనకర అంశం అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఉద్యోగుల సంఖ్య 5 వేలకుపైగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో (Q3) ఉద్యోగుల సంఖ్య 6101 పడిపోయింది. రెండో త్రైమాసికంలో 7530 తగ్గింది. ఇప్పుడు కూడా పడిపోయింది.
ఇన్ఫోసిస్ సంస్థ గురువారం రోజు( ఏప్రిల్ 18) క్యూ4 ఫలితాల్ని ప్రకటించింది. విశ్లేషకుల అంచనాల్ని తలకిందులు చేస్తూ భారీగా లాభం నమోదు చేసింది. అంతకుముందటి త్రైమాసికంతో పోలిస్తే 30 శాతం ఎగబాకి రూ. 7969 కోట్లకు చేరింది. ఆదాయం 1.2 శాతం మేర పుంజుకొని రూ. 37,923 కోట్లుగా నమోదైంది. మరోవైపు ఇదే సమయంలో రూ. 28 డివిడెండ్ ప్రకటించింది. దీంట్లో రూ. 8 స్పెషల్ డివిడెండ్.
అంతకుముందు గత వారంలో టీసీఎస్ కూడా క్యూ4 ఫలితాల్ని ప్రకటించగా.. మంచి లాభాల్ని నమోదు చేసింది. లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లుగా ఉంది. ఆదాయం 3.5 శాతం పెరిగింది. టీసీఎస్‌లో కూడా ఉద్యోగుల సంఖ్య Q4 లో తగ్గింది. ప్రస్తుత త్రైమాసికంలో 1759 మంది తగ్గిపోగా.. మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో 13,249 పడిపోయింది. ఇలా ఒక ఏడాదిలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం టీసీఎస్‌లో 19 ఏళ్లలో తొలిసారి.