తమ భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే చాలా మంది సంప్రదాయ పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతారు. అందులోనూ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే ఎక్కువగా తమ డబ్బులు డిపాజిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఎలాంటి రిస్క్ లేని స్థిరమైన రాబడి ఇందులో ఉంటుంది. అలాగే ఎక్కువగా సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు చూస్తుంటారు. బ్యాంకులు సైతం వారికి అదనపు వడ్డీ రేట్లను కల్పిస్తాయి. ఇంత వరకు బాగానే ఉన్నా మీరు డిపాజిట్ చేసే డబ్బులు ఎన్నేళ్లకు రెండింతలు అవుతాయి అనేది తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే దీర్ఘకాలం పాటు పొదుపు చేసినా రాబడి అంతం మాత్రంగానే ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదు. అధిక వడ్డీ రేట్లు ఉన్నట్లు వేగంగా డబ్బులు పెరుగుతాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందిస్తోంది. టెన్యూర్లను బట్టి జనరల్ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు మరో 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తోంది. సర్వోత్తమ్ నాన్ కాలబుల్ డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్లు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటే ఏడాది టెన్యూర్ పై అదనంగా 30 బేసిస్ పాయింట్లు ఇస్తోంది. అలాగే 2 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 40 బేసిస్ పాయింట్లు ఎక్కువ ఆఫర్ చేస్తోంది.
రూల్ 72..
మనం ఎంచుకునే టెన్యూర్, వడ్డీ రేట్ల ఆధారంగా డిపాజిట్లపై రాబడి ఆధారపడి ఉంటుంది. మనం పెట్టే డబ్బులు ఎన్నేళ్లకు డబుల్ అవుతాయనేది రూల్ 72 చెప్పేస్తుంది. మీరు ఎస్‌బీఐలో డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు బ్యాంకులు మీకు వడ్డీ రేట్ల వివరాలు వెల్లడిస్తాయి. దీని ఆధారంగా మీరు ఎన్నేళ్లు పడుతుందని అనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐలో గరిష్ఠ వడ్డీ రేటు జనరల్ కస్టమర్లకు 7 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటతో రూల్ 72ను భాగిస్తే వచ్చే సంఖ్యనే మీ డబ్బులు రెట్టింపు అయ్యే సంవత్సరాలను సూచిస్తుంది. అంటే 72/7= 10.3 అంటే పదేళ్ల మీద మూడు నెలల సమయం పడుతుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.5 శాతం వడ్డీ వర్తిస్తుంది. దీని ప్రకారం 72/7.5= 9.6 అంటే తొమ్మిదేళ్ల ఆరు నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం ఎస్‌బీఐలో 10 ఏళ్ల టెన్యూర్ పై జనరల్ కస్టమర్లకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. రూల్ 72 ప్రకారం చూసుకుంటే సీనియర్ సిటిజన్లు రూ.5 లక్షలు జమ చేస్తే వారికి 10 ఏళ్ల టెన్యూర్ పై రూ. 10 లక్షలపైన చేతికి అందుతాయి. అదే జనరల్ కస్టమర్లు ఇన్వెస్ట్ చేసినట్లయితే రూ.10 లక్షల కన్నా కాస్త రాబడి తగ్గుతుందని చెప్పవచ్చు.