సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం పొదుపు చేసేందుకు అవకాశం కల్పించేలా కేంద్రం పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరపున పోస్టాఫీసు ఈ స్కీమ్స్ అమలు చేస్తోంది. కొన్ని పథకాలు బ్యాంకుల్లోనూ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉంటుంది కాబట్టి తమ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం దాదాపు అన్ని పథకాలపై మంచి వడ్డీ రేట్లు అందిస్తోంది. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందుతాయి. అలాంటి వాటిల్లో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇందులో నెల నెలా చిన్న మొత్తాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. మరి మీరు నెలకు రూ.5000 జమ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. 5 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత చేతికి ఎంతొస్తుందో తెలుసుకుందాం?
పోస్టాఫీసు పథకాల్లో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లుగా ఉంటుంది. 5 ఏళ్ల పాటు ఇందులో నెల నెలా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పోస్టాఫీసులో మీరు ఖాతా తీసుకోవచ్చు. సింగిల్, జాయింట్ ఖాతాలు సైతం తీసుకోవచ్చు. ఇందులో నామినీ ప్రయోజనాలు సైతం అందుకోవచ్చు. అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. కొన్నిసార్లు వడ్డీ రేట్లను పెంచితే, మరికొన్ని సార్లు తగ్గిస్తుంది. కొన్నిసార్లు స్థిరంగానూ ఉంచవచ్చు. వడ్డీ రేట్లు మారినప్పుడు వచ్చే రాబడి సైతం మారుతుంటుంది.
ప్రస్తుతం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పై 6.7 శాతం మేర వడ్డీ రేటు అందిస్తోంది. జనవరి 1, 2024 నుంచే ఈ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. మూడు నెలలకు ఒకసారి వడ్డీ అనేది ఖాతాలోకి యాడ్ అవుతుంటుంది. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు. ప్రతి నెలా 15వ తేదీలోపు ఖాతాలో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వడ్డీ అనేది జనరేట్ అవుతుంది.
రూ.5000 జమ చేస్తే ఎంతొస్తుంది?
ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేల చొప్పున ఈ పథకంలో జమ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మొత్తం పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. దానిపై 6.7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ అవుతుంది. ఇలా మొత్తంగా మెచ్యూరిటీ నాటికి వడ్డీ రూ. 56,800 వరకు లభిస్తుంది. అంటే 5 ఏళ్ల తర్వాత చేతికి రూ. 3,56,800 వరకు వస్తాయి.