భారత్‌లో అత్యంత నమ్మకమైన సంస్థగా పేరుగాంచింది టాటా గ్రూప్. ఈ గ్రూప్ కింద ఎన్నో రంగాలకు చెందిన ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాటిల్లోనే ఒకటి తాజ్ మహల్ హోటల్. ఇది ఎంతో ఫేమస్. ముఖ్యంగా వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు సహా అత్యంత ధనవంతులు, అంతర్జాతీయ సెలబ్రిటీలు ముంబైలో ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. ఈ హోటల్‌లో రాజరికం ఉట్టిపడుతుంటుంద. దీంట్లో ఒక మానవీయ కోణం కూడా ఉంది. టాటా గ్రూప్ మాజీ ఛైర్‌పర్సన్ రతన్ టాటా మూగజీవాలపైన చూపే ప్రేమకు కూడా ఈ హోటల్ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలు రుబీ ఖాన్ తన లింక్డ్ ఇన్ పోస్టులో ఈ విషయం వెల్లడించారు.
ఆమె తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లినప్పుడు ఒక వీధి శునకం ప్రవేశద్వారం (ఎంట్రీ గేట్) పక్కనే నిద్రపోవడాన్ని గమనించినట్లు చెప్పారు. అంతటి విలాసవంతమైన ప్రదేశంలో శునకం ఎందుకు ఉందనే సందేహం రావడంతో.. సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే ఆ సమాధానం విని రతన్ టాటాపై ఆమెకు గౌరవం మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు.
'ఆ శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగింది. హోటల్లో ఒక భాగమైపోయింది. ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే ఏ మూగజీవాన్ని అయినా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్ టాటా నుంచి విస్పష్ట ఆదేశాలు ఉన్నాయి.' అని సిబ్బంది చెప్పారట.
>> రోజూ అక్కడ వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రదేశంలో శునకం అక్కడ ప్రశాంతంగా నిద్రించడం తన మనసును తాకిందని పేర్కొన్నారు రూబీ. చాలా మంది అతిథులు హోటల్‌కు వచ్చే వారు ఆ విషయం గమనించి ఉండకపోవచ్చన్నారు. మనం ఎక్కువగా మాట్లాడుకునే కలుపుగోలుతనం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సైకలాజికల్ సేఫ్టీ వంటివి ఇక్కడ కార్యచరణలో కనిపించినట్లు చెప్పారు. లింక్డ్‌ఇన్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో రతన్ టాటా మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
>> టాటా.. మూగజీవులపై ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే ఉంటారు. బాంబే హౌస్‌లోని తన ప్రధాన కార్యాలయంలో వీధి శునకాల కోసం ఒక ప్రత్యేక గది కేటాయించడం విశేషం. అక్కడ వాటి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇంకా ప్రతిసారీ వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రతన్ టాటా వాహనదారులకు ఒక అభ్యర్థన చేస్తుంటారు. 'వానా కాలం వచ్చింది. ఈ సమయంలో కార్ల కింద వీధి కుక్కలు, పిల్లులు తలదాచుకుంటాయి. కారును ముందుకు పోనిచ్చే సమయంలో దాని కింద ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే అవి గాయపడటం లేదా చనిపోవడం జరుగుతుంది.' అని పోస్ట్ పెట్టారు.