ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన కార్ల ధరలను తగ్గించినట్లు శనివారం ప్రకటించింది. ఆటో గేర్ షిప్ట్ కార్లకు మాత్రమే ఈ ధరల తగ్గింపు వర్తిస్తుందని వెల్లడించింది. తగ్గించిన ధరలు ఈ రోజు నుంచే (జూన్ 1వ తేదీ) అమలులోకి వచ్చిందని కంపెనీ తన ఎక్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మరి ఏ మోడళ్లపై ఎంత తగ్గనుంది అనేది ఓసారి పరిశీలిద్దాం.
మారుతీ సుజుకీ ధరల తగ్గింపు ప్రకటించిన ఏజీఎస్ వేరియంట్ మోడళ్లలో ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలేరియో, వ్యాగన్ ఆర్, డిజైర్, స్విఫ్ట్, ఇగ్నిస్, ఫ్రాంక్స్ ఉన్నాయి. ఆయా కార్ల ధరలపై రూ. 5 వేల వరకు తగ్గింపుతో లభించనున్నాయి. ఆటో గేర్ షిఫ్ట్ మోడళ్లను మరింత అందుబాటు ధరలో ఉంచేందుకు ఈ ధరల తగ్గింపు ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మారుతీ సుజుకీ మాత్రం కార్ల ధరల్ని తగ్గిస్తున్న కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
ఆటో గేర్ షిఫ్ట్ అనేది మారుతీ సుజుకీ కంపెనీ 2014లో తొలిసారి మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది ఒక ఆటో మేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ. ఇది మాన్యువల్, ఆటో మేటిక్ ట్రాన్స్‌మిషన్ ప్రయోజనాలను అందిస్తుంది. వాహన అవసరాన్ని బట్టి దానికదే గేరు మారుతుంటుంది. ట్రాఫిక్ పెరిగిపోతున్న క్రమంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఏజీఎస్ టెక్నాలజీ ఉండే కార్లతో డ్రైవింగ్ మరింత సులభతరమవుతుందని చెప్పవచ్చు. అలాగే ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ధరల తగ్గింపు ద్వారా తమ కంపెనీకి చెందిన ఏజీఎస్ మోడళ్ల వైపు మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన పోటీ ఉన్న భారత దేశ మార్కెట్లో తమ సేల్స్ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.