ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్‌ మధ్య తేడా ఏంటి.. వీటిలో ఎందులో ఖచ్చితత్వం ఎక్కువ

national |  Suryaa Desk  | Published : Sat, Jun 01, 2024, 09:49 PM

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఏ కూటమి అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తారు అని జనం చర్చించుకుంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గుతుంది.. ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటూ చిన్నా, పెద్దా, ముసలి, ముతక మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం లోక్‌సభ ఎన్నికల చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ 6 గంటలకు పూర్తి కాగానే. 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కొంతవరకు అంచనా వేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ మధ్య తేడా ఏంటి అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.


ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటూ ఓటరు నాడీ తెలుసుకునేందుకు మీడియా, ఇతర సంస్థలు రకరకాల సర్వేలు చేపడుతూ ఉంటాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం.. కౌంటింగ్ ప్రక్రియ ముగిసి రిజల్ట్స్‌ను ప్రకటించడానికి ముందు ఈ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ వెలువడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనే సందేహం కలుగుతుంది. అయితే ఒపీనియన్ పోల్స్ అంటే పోలింగ్‌కు ముందు నిర్వహించేది కాగా.. ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ తర్వాత నిర్వహించే సర్వే.


ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటి?


ఈ ఒపీనియన్ పోల్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విధించిన షరతులకు లోబడి ఆయా సంస్థలు వెల్లడిస్తాయి. అయితే ఈ ఒపీనియన్ పోల్స్‌ను ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు ఏ దశలోనైనా విడుదల చేయవచ్చు. అంటే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందు.. షెడ్యూల్ వచ్చిన తర్వాత, పార్టీలు పొత్తులు పెట్టుకున్న తర్వాత.. ఈ ఒపీనియన్ పోల్స్‌ సర్వేలు చేపడతారు. ఎన్నికల్లో ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ సర్వేలు చేపడతారు.


అయితే ఈ ఒపీనియన్ పోల్స్‌లో ఎవరిపై సర్వే నిర్వహించాలని ముందే నిర్వాహకులు నిర్ణయించుకుంటారు. అంటే యువత, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారిని కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కులం, మతం ప్రాతిపదికన కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఇలాంటి ఒపీనియన్ సర్వేలు సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి ఉంది. ఓటర్లు పాజిటివ్‌గా ఉన్నారా లేక నెగటివ్‌గా ఉన్నారా అనేది తెలుసుకుంటారు.


ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి?


అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత వెలువరించేవే ఎగ్జిట్ పోల్స్. ఎన్నికలు జరిగిన రోజే.. ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత ఓటర్లు ఇచ్చే సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటేశారు అనే వివరాలను నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్య, అభ్యర్థులను అంచనా వేసి.. చివరి విడత ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటిస్తారు.


ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఎందులో ఖచ్చితత్వం ఎక్కువ?


ఒపీనియన్ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌‌.. తుది ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఒపీనియన్ పోల్ అంటే ఎన్నికలు జరగకముందు నిర్వహిస్తారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంటే.. ఎన్నికలు పూర్తి కాగానే తీసుకుంటారు కాబట్టి.. ఓటర్ల నాడీ పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒపీనియన్ పోల్‌లో ఒక పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన ఓటరు.. పోలింగ్ సమయానికి మనసు మార్చుకుని.. వేరే పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. అందుకే ఓటు వేసిన తర్వాత అయితే ఖచ్చితమైన ఖచ్చితత్వం ఫలితం ఉంటుంది. అందుకే ఒపీనియన్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్‌లోనే ఖచ్చితమైన సమాచారం వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com