కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని.. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుండగా.. ఈసారి దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి అవుతోంది. దక్షిణాదిలో బీజేపీకి కేవలం ఒక్క కర్ణాటకలో మాత్రమే పట్టు ఉండగా.. తెలంగాణలో కాస్త సీట్లు సాధించేది. ఇక తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2019 లో కనీసం కమలం పార్టీ ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఈ 3 రాష్ట్రాల్లో బోణీ కొట్టబోతోందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
2024 స్థానాల్లో బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకోనుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 36 నుంచి 39 స్థానాలు దక్కించుకోనుందని వెల్లడైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 34 సీట్లు గెలుచుకోనుందని తెలిపింది. పుదుచ్చేరి సహా దక్షిణ భారత రాష్ట్రాల్లో 130 స్థానాలు ఉన్నాయి.
2019 లో దక్షిణ భారత రాష్ట్రాల్లో 29 సీట్లు సాధించగా.. ఈసారి ఆ సంఖ్య 36 నుంచి 39 స్థానాలకు పెరుగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడవుతోంది. కర్ణాటకలో బీజేపీ - జేడీఎస్ కలిపి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తుండగా.. ఆ ఒక్క రాష్ట్రంలోనే 23 నుంచి 26 సీట్లు సాధిస్తుందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. ఒక్క బీజేపీనే కర్ణాటకలో 21 నుంచి 24 సీట్లు గెలుస్తుందని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 7 స్థానాల్లో విజయం సాధించనుందని పేర్కొంది.
తమిళనాడు విషయానికి వస్తే.. డీఎంకే-కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 36 నుంచి 39 స్థానాల్లో విజయం సాధించనుందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 2019 ఎన్నికల్లో తమిళనాడులో ఉన్న మొత్తం 39 సీట్లకు గానూ డీఎంకే ఒంటరిగా 38 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈసారి తమిళనాడులో బీజేపీ పాగా వేయనుందని.. ఆ పార్టీ 1 నుంచి 3 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి 19 నుంచి 22 స్థానాలు గెలుచుకోనుందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. ఇక తెలంగాణలో కూడా బీజేపీ హవా కొనసాగనుందని అంచనా వేసింది. తెలంగాణలో బీజేపీకి 7 నుంచి 10 సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే 2019 లో దక్షిణ భారత రాష్ట్రాల్లోని కర్ణాటక, తెలంగాణలో మాత్రమే బీజేపీకి సీట్లు రాగా.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో అప్పటి నుంచి దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ, నరేంద్ర మోదీ.. అనేక పర్యటనలు చేసి.. సీట్లను పెంచే ప్రయత్నం చేశారు.