ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి రికరింగ్ డిపాజిట్లు మంచి అవకాశం. తమకు నచ్చిన విధంగా తక్కువ మొత్తంలో ఇందులో పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. మంచి వడ్డీ రావడంతో ఒకేసారి పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. రిస్క్ తీసుకోలేని వారికి పోస్టాఫీసు అందిస్తున్న రికరింగ్ డిపాజిట్లు (Recurring Deposit) ఎంచుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇందులో 5 ఏళ్ల పాటు పొదుపు చేసుకుంటూ వెళ్లినట్లయితే ఒకేసారి రూ.2.85 లక్షల వరకు అందుకోవచ్చు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీములో మీరు ప్రతి నెలా కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీకు స్థిరమైన రిటర్న్స్ వస్తాయి. అందుకే చాలా మంది ఈ పథకంలో పెట్టుబడులు పెడుతుంటారు. రిస్క్ తీసుకోలేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ 5 ఏళ్లుగా ఉంటుంది. తద్వార మంచి రాబడి వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు 6.7 శాతం ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు డిపాజిట్ పథకాల వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. కొన్నిసార్లు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. లేదా యథాతథంగా కొనసాగించవచ్చు. 2024 ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి గాను రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 6.7 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రూ. 2.85 లక్షలు ఎలా?
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ టెన్యూర్ 5 ఏళ్లుగా ఉంటుంది. ఇందులో మీరు 5 ఏళ్ల పాటు నెలకు రూ.4 వేల చొప్పున పొదుపు చేశారు అనుకుందాం. అంటే 60 నెలల పాటు మీరు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మీ నగదు మొత్తం 5 ఏళ్లలో రూ. 2,40,000 అవుతుంది. ప్రస్తుతం ఉన్న 6.7 శాతం వడ్డీ రేటుతో చూసుకుంటే 5 ఏళ్లలో మీకు రూ.45,463 వరకు వడ్డీ లభిస్తుంది. అంటే మొత్తంగా మీ చేతికి 60 నెలల మెచ్యూరిటీ తర్వాత రూ. 2,85,463 రిటర్న్స్ పొందుతారు. అయితే, మీరు డిపాజిట్ చేసే నగదును బట్టి మీకు వచ్చే రాబడి ఉంటుంది. రూ.4 వేలు కాకుండా ఎక్కువ సైతం ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, మీ పెట్టుబడిపై నెలకు రూ.10 వేల కన్నా ఎక్కువ వడ్డీ వస్తే గనక దానిపై 10 శాతం ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కట్ అవుతుందని గుర్తుంచుకోవాలి.