టెస్టు ఫార్మాట్ తన మొదటి ప్రాధాన్యత అని టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. టీమిండియా టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సూర్య ప్రస్తుతం టీ20 జట్టుకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. టీ20ల్లో చెలరేగే ఈ విధ్వంసకర బ్యాటర్ వన్డేల్లో నిరాశపరచడంతో ఆ ఫార్మాట్‌లో జట్టులో చోటు కోల్పోయాడు.ఇక 33 ఏళ్ల ఈ హిట్టర్ ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి టెస్టులు ఆడలేదు. అయితే గాయం కారణంగా ఆ తర్వాత టెస్టు జట్టులో చోటు కోల్పోయానని, తన స్థానంలో వచ్చిన యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో తాను ఎంపిక కాలేకపోతున్నాని సూర్య పేర్కొన్నాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి తిరిగి భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
''టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడానికి ఎంతో మంది ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. నేను కూడా టెస్టు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాను. అయితే భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత నాకు గాయమైంది. అనంతరం అవకాశాలు వచ్చిన ఆటగాళ్లు సత్తాచాటి రాణిస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు రావడానికి వాళ్లే అర్హులు. ఇక నా ప్రస్తుత దృష్టి అంతా.. బుచ్చిబాబు టోర్నమెంట్, దులీప్ ట్రోఫీ ఆడటమే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం'' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం సూర్య బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబై తరఫున ఆడుతున్నాడు. ముంబై జట్టులో సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కాగా, సెప్టెంబర్ 19 నుంచి టీమిండియా టెస్టు ఫార్మాట్ సందడి చేయనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అయిదు టెస్టులు ఆడనుంది.