కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే కీలక పదవికి ఎన్నికయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త ఛైర్మన్‌గా జై షా ఎన్నికయ్యారు. జై షా ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ICC మంగళవారం (ఆగస్టు 27) రాత్రి ఎక్స్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు.. ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా (35) గుర్తింపు దక్కించుకున్నారు. డిసెంబర్ 1 నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న జైషా.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
భారత్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైన ఐదో వ్యక్తి జై షా. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే నుంచి జైషా బాధ్యతలు తీసుకోనున్నాడు. మరో దఫా ఛైర్మన్ పదవికి పోటీ చేసేందుకు బార్క్‌లేకు అర్హత ఉన్నా.. ఆ పదవిలో కొనసాగడానికి ఆయన విముఖత చూపారు. మరే ఇతర వ్యక్తి కూడా ఈ పదవికి పోటీ పడలేదు. దీంతో ఎన్నికల్లో జై షా ఏకగ్రీవమయ్యారు.