సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను అతిథ్య వెస్టిండీస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం రాత్రి ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరిగిన నామా మాత్రపు మూడో టీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగా.. ఈ సమయంలో వర్షం పడింది. దీంతో అఫిషియల్స్ మ్యాచ్‌ను కాసేపు నిలిపారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం మ్యాచ్ సమయాన్ని కుదించి డీఎల్ఎస్ (డక్ వర్త్ లూయిస్) మెథడ్‌లో వెస్టిండీస్‌కు 13 ఓవర్లలో 116 పరుగుల టార్గెట్‌ను విధించారు. సాతాఫిక్రా బ్యాటర్లలో రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) పరుగులు చేశారు.
ఫెఫర్డ్ 2 వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, ఫోర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 13 ఓవర్లలో 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. మరో 22 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగిచింది. ఈ సిరీస్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కరేబియన్ బ్యాటర్స్.. 116 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలోనే ఛేజ్ చేసి సునాయస విజయం సాధించారు. ముఖ్యంగా వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 35 పరుగులు చేశాడు. అనంతరం షాయ్ హోప్ (42), షిమ్రోన్ హెట్‌మైర్ (31) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. తద్వారా మూడు మ్యాచుల సిరీస్ ను అతిథ్య వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది.