టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది బెంగాల్ తరఫున అతడు రంజీ బరిలో దిగే అవకాశం ఉంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించిన ప్రాబబుల్స్ జట్టులో షమీకి కూడా చోటు దక్కింది.ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పేస్ బౌలర్ రీ ఎంట్రీ చూడబోతున్నామంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన షమీ.. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నవంబరు 19 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న షమీ.. ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా.. ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో షమీ ఆడతాడని భావించినా.. బీసీసీఐ మాత్రం అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత అతడిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో స్వదేశంలో సెప్టెంబరులో బంగ్లాదేశ్, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడే టెస్టు సిరీస్‌లకు కూడా షమీ దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ తర్వాత జరుగనున్న రంజీ ట్రోఫీలో మాత్రం షమీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బెంగాల్ అసోసియేషన్ ప్రకటన ద్వారా తాజాగా వెల్లడైంది.బెంగాల్ తరఫున రంజీ 2024- 25 సీజన్‌లో ఆడేందుకు అవకాశం ఉన్న 31 మంది ఆటగాళ్ల జాబితాలో షమీ పేరు కూడా ఉండటంతో.. అతడు ఆస్ట్రేలియాతో సిరీస్ దాకా టీమిండియాకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆసీస్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. అందుకే అప్పటి వరకు షమీకి కావాల్సినంత రెస్టు ఇచ్చి.. రంజీ బరిలో దింపడం ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించి.. ఆపై ఈ సిరీస్‌లో ఆడించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.