సమిత్ ద్రవిడ్.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. టీమిండియా మాజీ హెడ్ కోచ్, మాజీ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడైన సమిత్.. ఇటీవల తన ప్రదర్శనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా భారత్ తరఫున అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరిగిన కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక టైటిల్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ పేస్ ఆల్‌రౌండర్ సేవలు వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో అతడిని ఆస్ట్రేలియాతో జరిగే అండర్ 19 సిరీస్ కోసం ఎంపిక చేసింది.
వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత్ బహుళ ఫార్మాట్ సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన రెండు జట్లలోనూ సమిత్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు రానుంది. సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ అమాన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్ తర్వాత భారత్ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో రెండు మ్యాచులు జరుగుతాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న కేఎస్‌సీఏ మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు అతడు బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. తాను ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 33 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. పేస్ ఆల్ రౌండర్ అయిన సమిత్‌కు ఈ టోర్నీలో ఇప్పటివరకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.
అయితే 18 ఏళ్ల సమిత్.. మంచి ఆల్ రౌండర్. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కూచ్ బెహర్ ట్రోఫీలో అతడు సత్తాచాటాడు. కర్ణాటక తరఫున ఆడిన ఈ 18 ఏళ్ల కుర్రాడు.. ఆ జట్టు తొలిసారి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 8 మ్యాచులు ఆడి.. ఏకంగా 362 రన్స్ స్కోరు చేశాడు. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌తో జరిగిన మ్యాచులో 98 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ సమిత్ అదరగొట్టాడు. 8 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్‌లో రెండు వికెట్లు తీసి.. ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే అతడికి భారత అండర్ 19 జట్టులో చోటు దక్కింది. మరి తన తండ్రి రాహుల్ ద్రవిడ్‌కు తగ్గ తనయుడిగా సమిత్ పేరు సంపాదిస్తాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది.