కొవిడ్ తర్వాతి కాలంలో రియల్ ఎస్టేట్‌కు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా భూములు, ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే స్థాయిలో అద్దెలు కూడా ఎక్కువ కట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నాలుగేళ్లలో దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై విశ్లేషించింది ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ మ్యాజిక్‌బ్రిక్స్. ఇళ్ల ధరల పెరుగుదలకు సంబంధించి.. ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నాలుగు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలోనే ఇళ్ల ధరలు ఏకంగా 80 శాతం వరకు పెరిగాయని తెలిపింది. దేశం మొత్తం మీద చూస్తే.. స్థిరాస్తి ధరల్లో ఎక్కువ పెరుగుదల హైదరాబాద్‌లోనే నమోదైందని మ్యాజిక్‌బ్రిక్స్ పేర్కొంది. దేశంలోని 10 ముఖ్య నగరాల్లో ఇళ్ల ధరలకు సంబంధించి.. ఈ సంస్థ విశ్లేషించి రిపోర్ట్ రూపొందించింది.
ఇళ్ల ధరలు అనూహ్య రీతిలో పెరిగినప్పటికీ.. ఇదే స్థాయిలో ప్రజల ఆదాయాలు పెరగకపోవడంతో.. ఇళ్లు కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన రుణాలకు మాత్రం నెలవారీ కిస్తీల (ఈఎంఐ) భారం ఎక్కువ అవుతుందని వివరించిందీ సంస్థ. ఈ రిపోర్టులో పేర్కొన్న విషయాల్ని ఇప్పుడు చూద్దాం.
>> ఈ నాలుగేళ్లలో అంటే 2020-24 మధ్య చూస్తే.. దేశంలోని 10 నగరాల్లో ప్రజల ఆదాయాల్లో వృద్ధి 5.4 శాతంగానే ఉండగా.. ఇదే సమయంలో ఇళ్ల ధరలు 9.3 శాతం మాత్రం పెరిగాయి. దీనితోనే ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గింది.
>> దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో హైదరాబాద్‌లో అత్యధికంగా 80 శాతం ఇళ్ల ధరలు పెరిగాయి.
>> దేశ ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరాల్లో ఇళ్ల ధరలు.. మధ్య తరగతి వర్గం వారు భరించేలని స్థాయిలో ఉండగా.. చెన్నై, అహ్మదాబాద్ సహా కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కొంత అందుబాటు ధరల్లోనే ఇళ్లు ఇప్పటికీ లభిస్తున్నాయి.
>> ఈఎంఐ టు మంత్లీ ఇన్‌కం రేషియో అంటే.. సంపాదిస్తున్న దాంట్లో ఈఎంఐ వాటా గురించి చూద్దాం. 2020లో దేశంలో నెలవారీ ఆదాయం నుంచి ఇంటి లోన్ కోసం చెల్లిస్తున్న ఈఎంఐ వాటా 46 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 61 శాతానికి పెరిగింది. అంటే.. నెల జీతంలో 61 శాతం వరకు ఈఎంఐలకే పోతుందంట. ఈ లెక్కన ఇళ్ల కొనుగోలుదారులపై ఈఎంఐ భారం పెరిగిందన్నమాట.
>> ఇది నగరాల వారీగా చూస్తే.. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ వాటా ముంబైలో 116 శాతంగా ఉంది. ఇదే ఢిల్లీలో 82 శాతం, హైదరాబాద్ నగరంలో 61 శాతంగా ఉన్నట్లు మ్యాజిక్‌బ్రిక్స్ పేర్కొంది. ఈ 3 నగరాల్లోనే ఎక్కువగా జనం.. తమ కుటుంబ ఆదాయంలో ఎక్కువ మొత్తం హోం లోన్ ఈఎంఐ చెల్లించేందుకు కేటాయిస్తున్నారు. కోల్‌కతాలో ఇది 47 శాతంగా, అహ్మదాబాద్, చెన్నై వంటి చోట్ల 41 శాతంగా ఉంది.
>> 2021, 22 సంవత్సరాల్లో తక్కువ వడ్డీ రేట్లు ఉండటంతో పాటు.. ఇళ్ల ధరలు కూడా అందుబాటులో ఉన్నందునే ఎక్కువ ఇళ్ల విక్రయాలు నమోదైనట్లు చెప్పారు మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్. ఆ తర్వాతే పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయని అన్నారు. ఆదాయానికి మించి ఇళ్ల ధరలు పెరగడం కారణంగా.. డిమాండ్ మందగించినట్లు వివరించారు.