ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా తమకు అందే ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా చాలా మంది తమ నెల జీతం వచ్చిందా లేదా అనేదే చూసుకుంటుంటారు. వారి ప్యాకేజీలో ఏమేం భాగంగా ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చాలా వరకు ఇప్పట్లో కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్, డియర్‌నెస్ అలవెన్స్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ సహా వేరియబుల్ పే వంటివి ప్యాకేజీలో భాగం చేస్తుంటాయి. వీటిల్లో చాలా వరకు మనకు మళ్లీ చెల్లిస్తుంటాయి. ఇందులోనే మనం గ్రాట్యుటీ గురించి తెలుుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఏదైనా సంస్థలో ఉద్యోగం కనీసం 5 సంవత్సరాలు లేదా అంతకుమించి పనిచేస్తే.. గ్రాట్యుటీకి అర్హులుగా పరిగణిస్తారు.
ఉద్యోగి జీతం సహా డీఏ ఆధారంగా గ్రాట్యుటీని లెక్కిస్తారు. వాస్తవంగా గ్రాట్యుటీ అనేది ఆ ఉద్యోగి సర్వీస్ కాలం చివరిసారిగా అందిన బేసిక్ పే పై లెక్కిస్తారని చెప్పొచ్చు. గ్రాట్యుటీ చట్టం ప్రకారం.. నెలకు 26 రోజుల పనిదినాలు అని లెక్కించి చెల్లించాలి.
ఒక సంస్థలో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లయితే.. ఆ సంస్థ ఉద్యోగులకు కొంత సొమ్ము రూపంలో ఇచ్చే బెనిఫిట్స్‌నే గ్రాట్యుటీ అంటారు. ఇక్కడ ఉద్యోగి కచ్చితంగా ఐదేళ్ల పాటు ఒకే సంస్థలో పనిచేసి ఉండాలి. ఇలా ఎన్నేళ్లు ఉంటే అంతకాలానికి చెల్లిస్తారు. పని చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల వేతనానికి సమానమైన సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం అంటే ఇక్కడ బేసిక్ శాలరీ, డీఏ, కమిషన్ అన్నీ కలుపుకొని ఉంటుంది.
ఇంకా ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ పనిచేసినా సంవత్సరంగా లెక్కిస్తారు. ఉదాహరణకు 7 ఏళ్ల 6 నెలలు పనిచేసినా.. 8 సంవత్సరాలుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్కడ 15 రోజులకు సమానమైన వేతనం కాబట్టి.. గ్రాట్యుటీని (నెల వేతనంX 15X సర్వీస్ కాలం)/26 (పనిదినాలు) గా లెక్కిస్తారు.
ఇప్పుడు మీకు బేసిక్ శాలరీ రూ. 15 వేలు ఉందనుకుందాం. సర్వీస్ కాలం 35 సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు ఈ రెండు గణిస్తే.. 15,000x35= రూ. 5,25,000. 15 రోజుల చొప్పున కాబట్టి.. 5,25,000x15= 78,75,000. నెలకు 26 పని దినాలతో దీనిని డివైడ్ చేయాలి. అప్పుడు 78,75,000/26= రూ. 3,03,846.15. ఇది 15 వేల బేసిక్ శాలరీపై 35 ఏళ్ల కాలానికి వచ్చే డీఏ అన్నమాట. ఇలాగే మిగతా లెక్కలు చేసుకోవచ్చు. అయితే బేసిక్ పే పైనే వర్తిస్తుందనేది గుర్తుంచుకోవాలి.