ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు లోన్ తీసుకోవాల్సి వస్తుంది. వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. దీంతో చాలా మంది బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. అయితే లోన్లు మంజూరు చేసేందుకు కొన్ని నిబంధనలు అనుసరిస్తాయి బ్యాంకులు. లోన్ తీసుకునే వ్యక్తి వృత్తి, పని చేసే కంపెనీ, ఆదాయం, వయసు, క్రెడిట్ స్కోర్, పాత రుణాల వంటివి పరిశీలిస్తాయి. రుణ ఎగవేతలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగువేస్తుంటాయి. వివిధ కారణాలు చెప్పి లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంటాయి. అలా మీకూ ఈ సంఘటన ఎదురైతే మరి ఏం చేయాలి? రుణ అర్హతలను మెరుగుపరుచుకోవడం ఎలా? ఆ వివరాలు తెలుసుకుందాం.
లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందే మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ యోగ్యతను ఎలా లెక్కిస్తారో అర్థం చేసుకోవాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉండాలి. మీ క్రెడిట్ చరిత్ర, లోన్ రీపేమెంట్ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 అంత కంటే ఎక్కువ స్కోర్ ఉంటే లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. అందుకే క్రెడిట్ బ్యూరోల ద్వారా మీ స్కోర్ క్రమంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే మీ క్రెడిట్ నివేదికను సమీక్షించి సరి చేసుకోవాలి. క్రెడిట్ కార్డు వాడితే దాని పరిమితిలో 30 శాతానికి మించకుడా చూసుకోవాలి. క్రెడిట్ కార్డు బకాయిలను నిర్ణీత సమయంలో చెల్లించాలి. దీంతో మీ స్కోర్ పెరిగి బ్యాంకులు రుణ మంజూరుకు మొగ్గు చూపుతాయి.
అలాగే బ్యాంకులు ప్రధానంగా చూసే అంశం ఆదాయం, అప్పుల నిష్పత్తి. డీటీఐ నిష్పత్తి మీ స్థూల నెలవారీ ఆదాయలో లోన్ చెల్లిపులు ఎంత శాతం ఉన్నాయనేది చెబుతుంది. మీకు నెలకు రూ.1 లక్ష ఆదాయం ఉండి అందులో హోమ్ లోన్ ఈఎంఐ రూ.20 వేలు, కారు ఈఎంఐ రూ.6 వేలు, క్రెడిట్ కార్డు బిల్లు రూ.12 వేలు ఉందనుకుంటే అప్పుడు మీ డీటీఐ రేషియో 38 శాతంగా ఉంటుంది. 36-42 మధ్య ఉంటే పర్వాలేదని చెప్పవచ్చు. అంతకు మించితే మాత్రం బ్యాంకులు మీ రుణ దరఖాస్తును తిరస్కరిస్తాయి. అప్పుడు మీ ఆదాయాన్ని పెంచుకోవడం లేదా పాత రుణాలను తగ్గించుకోవడం చేయాలి. మరోవైపు.. స్థిరమైన ఉపాధి, ఆదాయం ఉన్న వారికి లోన్ ఇస్తుంటాయి.
పెద్ద మొత్తంలో లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు సంకోచించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీరు డౌన్‌పేమెంటును పెంచితే లోన్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో బ్యాంకుకు రిస్క్ తగ్గుతుంది. మీ లోన్ అర్హత మెరుగుపడుతుంది. హోమ్ లోన్, వెహికల్ లోన్స్‌లో 30 శాతం డౌన్‌పేమెంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగే రుణ ఎగవేతలు లేకుండా చూసుకునేందుకు బ్యాంకులు వివిధ నియమాలు పాటిస్తాయి. మీకు లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తే బలమైన ఆర్థిక ప్రొఫైల్ ఉన్న వ్యక్తితో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. మీరు కట్టలేని పరిస్థితిలో బాధ్యత వహించేందుకు సహ దరఖాస్తుదాడురు అంగీకరించాలి. అప్పుడు మీకు వేగంగా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.