టీమ్ ఇండియా యువ ఓపెనర్, 22 ఏళ్ల యశస్వి జైశ్వాల్ ముంగిట అద్భుతమైన రికార్డు ఉంది. తనింకా టెస్టు సిరీస్ లో 132 పరుగులు చేస్తే చాలు.. ఏకైక భారత క్రికెటర్ గా అవతరిస్తాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలను ఐసీసీ ప్రతీ రెండేళ్లకు ఓసారి నిర్వహిస్తోంది. ఈ రెండేళ్ల సీజన్ లో టెస్టు మ్యాచ్ ల్లో ఎవరెక్కువ పరుగులు చేస్తే.. వారు రికార్డు సాధిస్తారు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25) కాలంలో యశస్వి ఇప్పటివరకు 1028 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లో మరో 132 పరుగులు చేస్తే చాలు .. డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్ లో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా నిలుస్తాడు. ఈ రికార్డు పరుగుల వీరుడు విరాట్ కొహ్లీకి కూడా దక్కలేదు. అయితే యశస్వి కన్నా ముందు 2019-21 సీజన్ లో ఆజింక్యా రహానే 1159 పరుగులు చేశాడు. ఇప్పుడు యశస్వి అందుకు 132 పరుగుల దూరంలో నిలిచాడు. ఇదే కాదు మరో 371 పరుగులు చేస్తే చాలు.. వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్.. జో రూట్ (1398 రన్స్) ని కూడా అధిగమిస్తాడు. ఎందుకంటే ఇండియన్ టెస్టు క్రికెట్ లోకి వచ్చిన అనతికాలంలోనే యశస్వి అద్భుతంగా ఆడాడు. ఇప్పటికి 9 టెస్టులు ఆడి 16 ఇన్నింగ్స్ లో 1028 పరుగులు చేశాడు. ఇందులో 2 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలున్నాయి.