ఇటీవల దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలకడానికి గల కారణాలు వివరించాడు.టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకోవడం కోసం దేశవాళీ క్రికెట్‌లో ఆడే ప్రేరణ లేకపోవడంతో రిటైర్మెంట్ తీసుకున్నానని తెలిపాడు.అంతేగాక గత కొన్నేళ్లు తక్కువగా క్రికెట్ ఆడానని, దీంతో అంతగా ఫామ్‌లో కూడా లేనని ధావన్ అన్నాడు. ఈ నేపథ్యంలో ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ''దేశవాళీ క్రికెట్ ఆడాలనుకోలేదు. 18 ఏళ్ల నుంచి ఆడటం ప్రారంభించాను. అయితే ఇప్పుడు అందులో ఆడాలనే ఉత్తేజం నాలో లేదు. గత రెండేళ్లను తిరిగి చూస్తే.. నేను పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ మాత్రమే ఆడాను. మొత్తంగా తక్కువ క్రికెట్ ఆడాను''
''ఇక క్రికెట్ చాలు అనిపించింది. విరామం తీసుకోవాలనిపించింది. నేను ఎక్కువగా క్రికెట్ కూడా ఆడలేదు. దీంతో టచ్ కూడా క్రమంగా కోల్పోతున్నాను. ఐపీఎల్ కోసం రెండు, మూడు నెలలు కష్టపడినట్లుగా ఆటను కొనసాగించడం సాధ్యం కాదనిపించింది. అందుకే రిటైర్మెంట్ తీసుకున్నాను. కెరీర్‌లో సాధించిన దాని పట్ల సంతృప్తితో ఉన్నా, సంతోషంగా ఉన్నా. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది'' అని ధావన్ పేర్కొన్నాడు. 38 ఏళ్ల ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. 2022లో చివరిగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఓపెనర్‌గా అరుదైన రికార్డులు నమోదుచేశాడు.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 117 మ్యాచ్‌ల్లో 45.15 సగటుతో 5193 పరుగుల భాగస్వామ్యాన్ని ధావన్ నెలకొల్పాడు. అయితే రోహిత్ గురించి మాట్లాడుతూ.. టీమిండియా సారథిని ధావన్ కొనియాడాడు. రోహిత్ గొప్ప కెప్టెన్ అని అభివర్ణించాడు. ''రోహిత్ గొప్ప కెప్టెన్. కెప్టెన్‌గా అతడు దేశానికి ప్రపంచకప్‌ను అందించినందుకు సంతోషంగా ఉంది. చాలా కాలం ప్రపంచకప్ కోసం ఎదురుచూశాం. టైటిల్‌కు చేరువయ్యాం కూడా. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌తో లక్ష్యాన్ని అందుకున్నాం. అతను ఎంతో అనుభవం ఉన్న కెప్టెన్. అతని నాయకత్వాన్ని ఆటగాళ్లంతా ఇష్టపడతారు. భారత జట్టుకు అద్భుతంగా పనిచేస్తున్నాడు '' అని ధావన్ పేర్కొన్నాడు.