గ్వాలియర్ లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విశేషంగా రాణించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పేలవంగా ఆడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. బగ్లా ఇన్నింగ్స్ లో మెహిదీ హసన్ మిరాజ్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 27 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లతో బంగ్లాదేశ్ లైనప్ ను దెబ్బతీశారు. కెరీర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ 1 వికెట్ తీశాడు. వాషింగ్టన్ సుందర్ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. 7 బంతుల్లోనే 16 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ... రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం మరో ఓపెనర్ సంజు శాంసన్ 14, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులతో ఆడుతున్నారు.