ఐపీఎల్ మెగావేలం కోసం తమ రిటెన్షన్ జాబితాపై ఫ్రాంచైజీలు కసరత్తు కొనసాగుతోంది. ఈ సారి పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడం ఖాయమైంది.దీంతో ప్రతీ ఫ్రాంచైజీ రిటెన్షన్ జాబితా ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా ఉన్న ముంబై ఇండిaయన్స్ రిటెన్షన్ జాబితాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ను వేలంలోకి వదిలేయడం ఖాయమైంది. ముంబై రిటెన్షన్ లిస్ట్ చూస్తే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాను మొదటి ప్రయారిటీగా తీసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. గత కొన్ని సీజన్లుగా ముంబైకి అత్యంత కీలకమైన ఆటగాడిగా బూమ్రా కొనసాగుతున్నాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్టుగా ఎన్నో మ్యాచ్ లు గెలిపించిన బూమ్రా గత సీజన్ లో 20 వికెట్లు తీశాడు.
అలాగే సూర్యకుమార్ యాదవ్ ను కూడా ముంబై రిటైన్ చేసుకోనుంది. మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ ప్రతీ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ లో 345 పరుగులు చేసిన సూర్య కుమార్ ఇటీవలే భారత టీ ట్వంటీ కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లో సూర్యాభాయ్ ను ముంబై వదులుకునే ప్రసక్తే లేదు. అటు తెలుగుతేజం తిలక్ వర్మ పేరు కూడా ముంబై రిటెన్షన్ జాబితాలో ఉన్నట్టు సమాచారం. గత మూడు సీజన్లలో తిలక్ వర్మ దుమ్మురేపాడు. 2024 సీజన్ లో ముంబై తరపున అత్యంత నిలకడగా రాణించిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 3 హాఫ్ సెంచరీలతో 416 పరుగులు చేశాడు. తిలక్ ను ముంబై ఫ్రాంచైజీ ఆర్టీఎం ద్వారా దక్కించుకునే అవకాశముంది. అలాగే ఓపెనర్ ఇషాన్ కిషన్ ను కూడా రైట్ టూ మ్యాచ్ ద్వారా తీసుకోనుంది. ఇక సఫారీ పేసర్ కొయెట్జీని అన్ క్యాప్డ్ కేటగిరీలో దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.