డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచి దాదాపు 9 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్న ఈ షేర్ ఏ దశలోనూ కోలుకోలేదు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గాను ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. దీంతో ఉదయం నుంచి అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27 వేల కోట్ల మేర పడిపోయింది.ఉదయం ఎన్ఎస్ఈలో డీమార్ట్ షేర్ 9.46 శాతం క్షీణించి రూ.4,139కు పడిపోయింది. ఆ తర్వాత 8.54 శాతం క్షీణించి రూ.4,182 వద్ద ట్రేడ్ అయింది. టాటా గ్రూప్ కంపెనీ ట్రెంట్ షేర్ కూడా ఈరోజు స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. అయితే డీమార్ట్ రిటైల్ చైన్ ఆపరేటర్ అవెన్యూ సూపర్ మార్ట్స్ క్యాపిటలైజేషన్‌ను ట్రెంట్ అధిగమించింది. ట్రెంట్ మార్కెట్ క్యాప్ రూ.2.92 లక్షల కోట్లుగా ఉండగా, అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ క్యాప్ రూ.2.72 లక్షల కోట్లుగా ఉంది.జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను డీమార్ట్ ఏకీకృత ప్రాతిపదికన రూ.660 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 5 శాతం పెరిగింది. ఆదాయం కూడా 14.41 శాతం పెరిగింది. అయితే ఖర్చులు 14.94 శాతం పెరిగినట్లు ప్రకటించింది. ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. ఖర్చులు పెరగడంతో బ్రోకరేజీ సంస్థలు కూడా డీమార్ట్ టార్గెట్ ప్రైస్‌ను తగ్గించాయి. దీంతో అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు భారీగా పడిపోయాయి.