భారత్-న్యూజిలాండ్ మధ్య రేపు (బుధవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కావాల్సిన తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకులు సృష్టించేలా ఉన్నాడు. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ఉదయం ప్రారంభమైన వర్షం కురుస్తూనే ఉండడంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దయింది. మ్యాచ్ జరిగే మొదటి రెండు రోజులూ దాదాపు 90 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని, మూడో రోజు 67 శాతం, శనివారం 25 శాతం, ఆదివారం 40 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్, టీ20 సిరీస్‌ను గెలుచుకుని మంచి ఊపుమీదున్న భారత జట్టు కివీస్‌ను కూడా సొంతగడ్డపై క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అదే జరిగితే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో టీమిండియాకు చోటు ఖాయమవుతుంది. తొలి టెస్టు కనుక వర్షార్పణం అయితే మాత్రం ఈ విషయంలో భారత్‌కు కొంత ఇబ్బంది తప్పదు.